ఈడీ విచారణ.. ఆ ముఖ్యమంత్రి ఏమైపోయారు!

ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు స్వయంగా ఢిల్లీలోని హేమంత్‌ సోరెన్‌ ఇంటికి వెళ్లారు.

Update: 2024-01-30 05:54 GMT

భూకుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులకు సంబంధించి తనపై ఎన్‌ ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులకు సంబంధించి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఈడీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నాలుగుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. అయినా సరే హేమంత్‌ సోరెన్‌ విచారణకు వెళ్లింది లేదు.

ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు స్వయంగా ఢిల్లీలోని హేమంత్‌ సోరెన్‌ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరు. ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. జనవరి 27 రాత్రి జార్ఖండ్‌ రాజధాని రాంచీ నుంచి ఢిల్లీకి సోరెన్‌ వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉంటున్నారో జాడ తెలియకపోవడం గమనార్హం.

భూకుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులో సీఎం హేమంత్‌ సోరెన్‌ కు ఈడీ జనవరి నెల 27 సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 నుంచి 31 తేదీల్లో ఏ రోజున విచారణకు అందుబాటులో ఉంటారో తెలియజేయాలని ఆ సమన్లలో కోరింది. అయితే వీటిపై హేమంత్‌ సోరెన్‌ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయనను విచారించడానికి నేరుగా సోరెన్‌ నివాసానికి వెళ్లారు.

సోరెన్‌ ఇంటికి ఉదయం 9 గంటలకు ఢిల్లీ పోలీసులతో కలిసి వచ్చిన ఈడీ అధికారులు సాయంత్రం పొద్దుపోయేవరకూ అక్కడే ఉన్నారు. అయితే ఆయన అక్కడ లేరని అధికారులు తెలిపారు. సంప్రదించడానికి ప్రయత్నించినా దొరకలేదని వెల్లడించారు. కాగా అధికారుల ఆరోపణలను సోరెన్‌ కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన వ్యక్తిగత పనిమీద వెళ్లారని, తిరిగి వస్తారని తెలిపారు.

కాగా.. హేమంత్‌ సోరెన్‌ జనవరి 31 మధ్యాహ్నం రాంచీలో విచారణకు అందుబాటులో ఉంటానని ఈడీ అధికారులకు మెయిల్‌ చేసినట్లు చెబుతున్నారు.

హేమంత్‌ సోరెన్‌ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈడీ అధికారులకు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ ఆయనపై విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి భయపడి గత 18 గంటలుగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అదృశ్యమయ్యారని ఎద్దేవా చేసింది.

మీడియా వర్గాల ప్రకారం.. జనవరి 29న అర్థరాత్రి హేమంత్‌ సోరెన్‌ చెప్పులు ధరించి, ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని, కాలినడకన ఢిల్లీలోని తన నివాసం నుంచి పారిపోయాడని జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. సోరెన్‌ తో పాటు ఢిల్లీకి వెళ్లిన స్పెషల్‌ బ్రాంచ్‌ సెక్యూరిటీ సిబ్బంది అజయ్‌ సింగ్‌ కూడా కనిపించడం లేదని తెలిపారు. వారి ఇద్దరి మొబైల్‌ ఫోన్లు కూడా స్విచాఫ్‌ అయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఈడీ, ఢిల్లీ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News