గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో.. ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం.
బలమైన గళం వినిపిస్తోందా? అది కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉందా? అయితే.. వెంటనే తాళం వేసేయండి! ఇదీ.. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తు న్న విధానం. ఇప్పటి వరకు ఒక ఎత్తు. అంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఎలా జరిగిపోయిందో. ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో.. ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైన సమయం. ఈ నేపథ్యంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.
గత ఐదేళ్లలో ఎంత మందికి నోటీసులు ఇచ్చారో లెక్కలు తెలియవు కానీ.. తాజాగా గడిచిన నాలుగు రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత.. అనూహ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న బలమైన గళాల కు ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరి సంఖ్య ఏకంగా 40 వరకు ఉందని తెలుస్తోంది. వీరిలో ముఖ్యమంత్రుల పిల్లల నుంచి మాజీ ముఖ్యమంత్రుల వరకు ఉన్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే.. వీరంతా బలమైన గళంతో మోడీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసేవారే కావడం గమనార్హం.
ఇదీ లెక్క..
తాజాగా నాలుగు రోజుల్లో ఈడీ నోటీసులు ఇచ్చిన వారిని చూస్తే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ విజయన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహు వా మొయిత్రా ఉన్నారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి చెందిన రాజా, యూపీ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీలక నేత, ఫైర్ బ్రాండ్, మోడీని ఓడిస్తామని చెప్పిన సోలంకి, మహారాష్ట్ర లోని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత కీర్తికార్, బీహార్ ప్రధాన ప్రతిపక్షం ఆర్‌జేడీ ఫైర్ బ్రాండ్.. బీజేపీని గద్దె దింపుతామని ప్రతిజ్ఞ చేసిన సుభాష్ లు సహా అనేక మంది ఉన్నారు.
మరి.. ఇదంతా చూస్తే.. దేశం ఎటు పోతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధానిని విమర్శించిన వారికి కూడా వార్నింగులు ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన తంగేడికి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన మంత్రికి కూడా నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేశారు. దీంతో అమర్త్యసేన్ వంటి నోబెల్ బహుమతి అందుకున్నవారు.. తాజాగా ప్రపంచ మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశం నిరంకుశ వైఖరి దిశగా అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం.