365 రోజులు తెరిచే ఉంచే ఐఫిల్ టవర్ కి కొత్త కష్టం!

ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎంతటి పెద్ద వ్యవహారం అయినా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టబడుతుంది అనడానికి తాజాగా మరో ఉదాహరణ తెరపైకి వచ్చింది.

Update: 2024-02-20 07:30 GMT

ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎంతటి పెద్ద వ్యవహారం అయినా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టబడుతుంది అనడానికి తాజాగా మరో ఉదాహరణ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా ఐఫిల్ టవర్ కి కొత్త కష్టం వచ్చింది. సంవత్సరం పొడవునా తెరిచి ఉంచే ఐఫిల్ టవర్ మూసివేయబడింది. ఉద్యోగుల సమ్మె ఇందుకు కారణంగా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఐఫిల్‌ టవర్‌ సందర్శనకు పర్యాటకులను అనుమతించలేదు. ఈ క్రమంలో... "సమ్మె కారణంగా ఐఫిల్‌ టవర్‌ ను మూసివేశాం. మన్నించగలరు" అనే ప్లకార్డు కట్టడం టవర్ ఎంట్రన్స్ గేట్ వద్ద కనిపించింది. సాధారణంగా 365 రోజులు సందర్శకుల కోసం తెరిచే ఉంచబడే ఈ కట్టడం ఉద్యోగుల సమ్మె కారణంగా మూసివేయడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే సైట్‌ లలో ఒకటైన ఐఫిల్ టవర్... ఆర్థిక నిర్వహణ సరిగా లేదంటూ ఉద్యోగులు చేసున్న సమ్మె కారణంగా మూసివేయబడటం చర్చనీయాంశం అయ్యింది. సెంట్రల్ ప్యారిస్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన 300మీటర్ల మైలురాయి ఫ్రెంచ్ రాజధానిలో సమ్మర్ ఒలింపిక్స్‌ కు ముందు సందర్శకుల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలో సమ్మె కారణంగా సమస్యను ఎదుర్కొంటుంది.

సోమవారం ఐఫిల్ టవర్‌ ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులు దాని వెబ్‌ సైట్‌ లో పలు లాంగ్వేజెస్ లో హెచ్చరికలతో ఒక నోట్ దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా... సందర్శకులు స్మారక చిహ్నం వద్దకు వెళ్లే ముందు వెబ్‌ సైట్‌ ను చెక్ చేయాలని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారి పర్యటనను వాయిదా వేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ టిక్కెట్లకు సంబంధించి తమ ఇన్‌ బాక్స్‌ లను ముందుగా చెక్ చేసుకోవాలని తెలిపారు.

కాగా... గత ఏడాది డిసెంబర్‌ లో కాంట్రాక్ట్ చర్చలపై సమ్మె కారణంగా క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల సమయంలో సందర్శకులకు ఒక రోజంతా మూసివేయబడింది. ఈ క్రమంలో తాజాగా ఈ నెలలో మరోసారి అటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో... ఐఫిల్ టవర్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీజీటీ యూనియన్‌ కు చెందిన స్టెఫాన్ డ్యూ స్పందించారు.

ఇందులో భాగంగా... ప్యారిస్ మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉన్న స్మారక చిహ్నాన్ని మెరుగుపరచడం, టిక్కెట్ విక్రయాల నుండి వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతం పెంచడం వంటి డిమాండ్ లతో సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News