కంపెనీ మారతావా? రూ.25 కోట్లు కట్టమంటూ షాకిచ్చిన విప్రో

ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.25 కోట్లతో పాటు దాని మీద వడ్డీని కలిపి నష్టపరిహారాన్ని అందజేయాలంటూ కోర్టులో కేసు వేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2023-12-30 04:44 GMT

తమ సంస్థలో కీలక ఉద్యోగిగా వ్యవహరిస్తూ.. రీసెంట్ గా కంపెనీ మారి.. ప్రత్యర్థి కంపెనీలో చేరిన ఉన్నత ఉద్యోగికి దిమ్మ తిరిగేలా షాకిచ్చింది దిగ్గజ ఐటీ సంస్థ విప్రో. గతంలో విప్రో సీఎఫ్ వోగా వ్యవహరించే జతిన్ దలాల్ ఈ మధ్యన ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నిజెంట్ కు మారిన విషయం తెలిసిందే.

అయితే.. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్న విప్రో.. సదరు ఉన్నత ఉద్యోగి మీద బెంగళూరు కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.25 కోట్లతో పాటు దాని మీద వడ్డీని కలిపి నష్టపరిహారాన్ని అందజేయాలంటూ కోర్టులో కేసు వేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నట్లుగా దేశీయంగా ప్రముఖ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబరు 29నుంచి చెల్లింపుల తేదీ వరకు 18 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని దలాల్ బహిర్గతం చేయకుండా ఉండేందుకు అతడిపై శాశ్విత నిషేధాన్ని విధించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. అయితే.. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలని దలాల్ కోరగా.. దీనిపై తుది నిర్ణయం తీసుకోవటానికి కోర్టు తన తదుపరి వాయిదాలో తేల్చనుంది.

విప్రోలో పని చేసిన జతిన్ దలాల్ డిసెంబరు ఒకటిన కాగ్నిజెంట్ లో సీఎఫ్ వోగా చేరారు. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి అప్లికేషన్ పెట్టారు. ఈ సెక్షన్ ప్రకారం ఇరు వర్గాలను మధ్యవర్తిత్వానికి సూచన చేసే అధికారం కోర్టుకు రానుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు విప్రోలో పని చేసిన ఆయన.. 2015 నుంచి సీఎఫ్ వోగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా కాగ్నిజెంట్ లో చేరినఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తి అయ్యాక అయితే అమెరికాకు లేదంటే యూరప్ కు కానీ వెళ్లే వీలుంది. అంతకు మందు.. ఈ కోర్టు వివాదం ఒక కొలిక్కి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News