ఏఐ ప్రచారం.. పార్టీలకు ఈసీ అడ్వయిజరీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రచారంపై ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ (Artificial intelligence) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా.. అన్ని రంగాల్లోనూ ఏఐ విస్తరిస్తోంది. మనుషులతో పనిలేకుండా.. మనుషులు చేసే అన్ని పనులను ఏఐ చేస్తోంది. తాజాగా.. ఎన్నికల ప్రచారంలో ఏఐ సత్తాచాటనుంది. ఎన్నికల్లో ఇప్పటికే ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రచారంపై ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఏఐని వాడుతున్న పార్టీలు.. వారు సృష్టించే కంటెంట్ పారదర్శకంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే.. అభ్యర్థులు వాటిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలంది. ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఆడియో, వీడియోలు, చిత్రాలపై ఏఐ జనరేటెడ్, సింథటిక్ కంటెంట్ వంటి సంకేతాలను లేబుల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రచార ప్రకటనలను వ్యాప్తి చేసే సమయంలోనూ సింథటిక్ కంటెంట్ వినియోగించినా దానికి డిస్‌క్లయిమర్స్ ఉండాల్సిందేనని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు కీలక నిర్ణయం తీసుకునన్న ఈసీ కొత్త నిబంధనలతో అడ్వయిజరీ జారీ చేసింది. అయితే కొన్ని పార్టీలు సృష్టించే తప్పుడు కంటెంట్ ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈసీ ఈ అడ్వయిజరీని జారీ చేసింది.
నకిలీ కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈసీ ఎదుట పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దానివల్ల కలిగే నష్టాల గురించి ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సైతం హెచ్చరించారు. నకిలీ కంటెంట్, తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ మేరకు ఈ కొత్ అడ్వయిజరీని జారీ చేసింది.