3,35,27,925.. ఇది తెలంగాణ ఓటర్ల సంఖ్య!

దీని ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925గా తేల్చారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈ ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేల్చారు.

Update: 2025-01-07 04:58 GMT

తెలంగాణ రాష్ట్ర ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ముగిసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి ప్రకటించారు. దీని ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925గా తేల్చారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈ ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేల్చారు. మహిళా ఓటర్లు 1,68,67,735 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,66,41,489గా నమోదయ్యారు. ట్రాన్స్ జెండర్లు 2,829గా తేల్చారు. మరో 15,872 మంది ఓటర్లు సర్వీసు ఓటర్లుగా తేల్చారు.

తాజా జాబితాలో కొత్తగా 2,19,610 మంది ఓటర్లు చేరగా.. మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకటించిన తుది జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రం మొత్తంలో ఓటర్లు 3,30,21,735గా తేలింది.2024తో పోలిస్తే తాజాగా విడుదల చేసిన ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటర్లకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చూస్తే.. 18-19 ఏళ్ల ఓటర్లు 5,45,026 మంది ఓటర్లు ఉండగా 85 ఏళ్లు.. ఆ పై ఉన్న ఓటర్లు 2,22,091గా తేల్చారు. ప్రవాస ఓటర్లు 3591 మంది ఉండగా.. దివ్యాంగ ఓటర్లు 5,26,993 మందిగా తేల్చారు.

రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 25,907కు పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కు పెరగ్గా.. గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కు పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కాగా.. అందులో 286 పట్టణ పోలింగ్ కేంద్రాలు.. 265గ్రామీణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. కేవలం 29 నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

హైదరాబాద్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపు అన్నిచోట్లా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లుగా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. కుత్భుల్లాపూర్ 7,34,155 ఓటర్లతో రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం (ఎస్టీ) 1,54,134 ఓటర్లు ఉన్నారు. 2 లక్షల లోపు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో అశ్వరావుపేట (ఎస్టీ).. వైరా (ఎస్టీ).. బాన్సువాడ.. బెల్లంపల్లి (ఎస్సీ).. చెన్నూరు(ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి.

సవరణలలో భాగంగా హైదరాబాద్ లో అత్యధికంగా 12,502 మందిని.. సంగారెడ్డిలో 9,219 మంది ఓటర్లను తొలగించగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా 831 మంది ఓటర్లను తొలగించారు. కొత్త ఓటర్లుగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 18,161 మంది.. హైదరాబాద్ లో 14,517 మంది.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13,086 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో 13789 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు.

Tags:    

Similar News