నెట్టింట ఏ పార్టీ ప్రకటనలు ఎవరిని ప్రభావితం చేశాయి?

ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆయా పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తుంటాయి.

Update: 2024-05-24 07:45 GMT

ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆయా పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తుంటాయి. వాస్తవంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారాలంటే... పబ్లిక్ మీటింగ్ లు, కార్నర్ మీటింగ్ లు, ర్యాలీలు ఒకెత్తు అయితే... డిజిటల్ ప్రకటనలు మరొకెత్తు గా ఉన్నాయి. ప్రధానంగా యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో ప్రకటలు ఆయా పార్టీల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయని చెబుతున్నారు.

అవును... దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్ బుక్ లో లాగిన్ అయినా, ఏదైనా వెబ్ సైట్ బ్రౌజింగ్ చేసినా రాజకీయ పార్టీల ప్రకటనలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ అనే తారతమ్యాలేమీ లేకుండా ప్రకటనలతో హోరెత్తించేశాయి.

ఈ క్రమంలో తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ప్రకటనలు పట్టణ ఓటర్లపై ప్రభావం చూపాయని "యూగవ్‌" సంస్థ నిర్వహించిన సర్వే తెలిపింది. ఇందులో భాగంగా... లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి పది మంది పట్టణ ఓటర్లలో ఆరుగురు బీజేపీ ప్రకటనలు చూశారని ఆ సర్వే తేల్చింది!

ఈ క్రమంలో... బీజేపీ రాజకీయ ప్రకటనలు 61% పట్టణ ప్రజలను వారికి ఓటు వేయడానికి గణనీయంగా ప్రభావితం చేశాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఎన్నికల సమయంలో తాము రాజకీయ ప్రకటనలు చూశామని 76 శాతం మంది తెలుపగా.. కేవలం 14 శాతం మంది మాత్రమే వాటిని పట్టించుకోలేదని చెప్పారని నివేదిక చెబుతుంది.

ఇదే సమయంలో... కనీసం ఒక ప్రకటన అయినా చూశామని చెప్పిన వారిలో 81 శాతం మంది భారతీయ జనతాపార్టీ ఇచ్చిన యాడ్స్‌ ను వీక్షించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రకటనలు చూశామని 47శాతం.. అమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటనలు చూశామని 12శాతం మంది మాత్రమే చెప్పారని నివేదిక వెల్లడించింది!

ఇక ఇతర పార్టీల యాడ్స్‌ ను 7శాతం మంది చూశారని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మిలీనియల్ (1981-1996 మధ్య జన్మించిన వారు) ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రకటనలు చూడడం గమనార్హం.

ఇదే క్రమంలో... రాజకీయ ప్రకటనలు వచ్చిన మాధ్యమాలలో యూట్యూబ్‌ అగ్రస్థానంలో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ వేదికలో యాడ్స్‌ చూశామని 67 శాతం మంది తెలపగా.. 58 శాతం వీక్షకులు టీవీలో ప్రకటనలు చూసినట్లు తెలిపారని అంటున్నారు. తర్వాత స్థానాల్లో 43% మందితో ఇన్‌ స్టాగ్రామ్‌, 38% మందితో వాట్సప్‌, 35% మందితో మెటా ఉన్నాయి.

Tags:    

Similar News