చంద్ర‌బాబుపై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌.. ఏం జ‌రిగింది?

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియ‌స్ అయ్యారు.

Update: 2024-04-05 08:52 GMT

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియ‌స్ అయ్యారు. ``ఆ వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు? మీరు సినియ‌ర్ నాయ‌కులు. నిబంధ‌న‌లు పాటించాల‌ని మీకు తెలియ‌దా? `` అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు.. ఈ నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని వెల్లడించారు. దీంతో టీడీపీలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.

ఏం జ‌రిగింది?

గత నెల 31న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చార యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు, మార్కాపు రం, బాపట్లల‌లో ప్ర‌జాగళం పేరుతో స‌భ‌లు నిర్వ‌హించారు. ఈ సభల్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్‌ను హంత‌కుడని, సొంత బాబాయిని చంపించార‌ని.. చెప్పారు. అంతేకాదు... హంత‌కుడికి ఒత్తాసుపలుకుతూ.. ఆయ‌న‌కే టికెట్ ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు...ఎన్నికల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని, చంద్ర‌బాబుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.

ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ మోహ‌న్‌రెడ్డి పై పరుష పదజాలంతో చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నాయ‌కులు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణువ‌ర్ధ‌న్‌లు ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన‌ వీడియో క్లిప్పింగుల‌ను కూడా అందించారు. వైసీపీ నేత‌ల‌ ఫిర్యాదును పరిశీలించిన సీఈవో చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

కామ‌నేనా?

హ‌త్య‌లు, హ‌త్యారాజ‌కీయాల‌కు సంబంధించిన వ్యాఖ్య‌ల‌ను ఒక‌ప్పుడు కామ‌నేన‌ని అనుకునేవారు. కానీ, 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన వివేకా హ‌త్య గురించి.. అప్ప‌టి ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రూ మాట్లాడ‌రాదంటూ .. అప్ప‌ట్లో ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు కూడా ఆ కేసులు.. హాట్ టాపిక్‌గానే మారాయి. దీంతో వీటిని ప్ర‌స్తావించాలా? వ‌ద్దా? అనే విష‌యం సంశ‌యంలోనే ఉంది. అయితే.. ఎన్నిక‌ల సంఘం ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌నందున‌.. ఇటు వైసీపీ నేత‌లు కూడా.. వివేకా హ‌త్య‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల వంటివారు ప్ర‌స్తావిస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు మ‌రింత వేడి పుట్టిస్తున్నారు. దీంతో ఇవి కామ‌న్ కాద‌ని.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని.. ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి.

Tags:    

Similar News