ఎన్నికల వేళ.. దువ్వేస్తున్నారు జాగ్రత్త బ్రో!!
ఇలాంటి వాటికి ఆకర్షితులై.. అందరూ మనోళ్లు అంటూ.. కూనిరాగాలు తీస్తున్నవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
వాళ్లు లేదు.. వీళ్లు లేదు.. అందరూ మనోళ్లే.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇది! నిజమే ఎన్నికల వేళ.. దువ్వుడు రాజకీయాలు జోరుగా సాగుతున్న క్రమంలో ప్రత్యర్థులకు చిక్కకుండా.. ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు నాయకులు వేస్తున్న ఎత్తుల్లో ఇదొకటి. టీ కలిపే స్తున్నారు... దోశలు పోసేస్తున్నారు.. కొన్ని కొన్ని చోట్ల దోభీఖానాలకు వెళ్లి బట్టలు సైతం ఉతికేస్తున్నారు. ఇక్కడి సరా!! ప్రచారంలో ఎక్కడైనా శవయాత్ర ఎదురొస్తే.. మనోడే అంటూ.. పాడె కూడా పట్టేస్తున్నారు.
ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం మాత్రం ఇదే. ప్రత్యర్థుల దూకుడుకు ఏదో ఒక విధంగా అడ్డుకట్ట వేయాలనే తలంపు ఒకవైపు.. తమ ఇమేజ్ పెంచుకోవాలనే తాపత్రయం మరోవైపు.. వెరసి నాయకులు దువ్వుడు రాజకీయాలను జోరుగా సాగిస్తున్నారు. అయితే.. ఇవన్నీ పైపై మెరుగులేనని అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో కీలక సమస్యలు ప్రస్తావించాల్సి వస్తే.. తప్పించుకుంటున్న నాయకులు.. అదేసమయంలో ఇలాంటి వ్యవహారాలకు దిగుతూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.
ఇలాంటి వాటికి ఆకర్షితులై.. అందరూ మనోళ్లు అంటూ.. కూనిరాగాలు తీస్తున్నవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలు.. ఈ తరహా రాజకీయాలకు ఎక్కువగా దిగు తున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నారు. వరుస విజయాలు దక్కించుకుని కూడా.. నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడని నాయకులు, సమస్యలపై అవగాహన లేని నాయకులు చాలా మంది ఉన్నారు. మహేశ్వరంలో మంత్రి సబిత.. తను గెలిచిన తర్వాత.. కేవలం రెండు సార్లు మాత్రమే పర్యటించారంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఇక, ఎల్‌బీ నగర్ కథ కూడా అలానే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత.. ఒకే ఒక్కసారి ఈటల రాజేందర్ .. నియోజకవర్గం మొహం చూశారు. మునుగోడు ఉపపోరులో గెలిచిన బీఆర్ ఎస్ అభ్యర్థి కూడా.. కేవలం రెండు సార్లు మాత్రమే నియోజకవర్గం గురించి పట్టించుకున్నారు. ఇక, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డికి.. స్థానికుడనే ట్యాగ్ ఉన్నా.. నియోజకవర్గం సరిహద్దులు తెలియవంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారనేది ఒక లెక్క. మరి ఓటర్లు జాగరూకతతో ఉండకపోతే కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.