మండుటెండలో పోలింగ్.... రికార్డు బద్దలు కొడుతుందా ?
అయినా ఈసారి మాత్రం అగ్గి నిప్పులు రాల్చే కాలంలో పోలింగ్ పడింది.
మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరగడం అన్నది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేదు, శీతాకాలం పోలింగ్ ని ఏపీ చూసింది. వేసవి పోలింగ్ ని చూసింది. అయినా ఈసారి మాత్రం అగ్గి నిప్పులు రాల్చే కాలంలో పోలింగ్ పడింది. ఒక విధంగా అగ్ని కత్తెరలు ఎంట్రీ ఇచ్చాక పోలింగ్ సాగుతోంది.
ఈసారి పోలింగ్ భారీగా జరగాలని ఎన్నికల సంఘం కోరుకుంటోంది. ఈ మేరకు అవగాహనా ర్యాలీలు ఏపీలో నిర్వహిస్తూ వచ్చింది. గతసారి ఏపీలో దాదాపుగా ఎనభై శాతం దాకా పోలింగ్ జరిగింది. ఆ రికార్డుని బద్ధలు కొట్టాలని అంతా ఓటింగ్ కి హాజరు కావాలని ఎన్నికల అధికారులు తమ వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు పోటా పోటీగా ప్రచారం సాగింది. దాంతో పాటు ఎవరూ తగ్గకుండా ఉన్నారు. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ప్రధాన రాజకీయ పక్షాలు ఏపీలో జోరు పెంచాయి. దాంతో ఈసారి పోలింగ్ భారీ ఎత్తున సాగుతుంది అని అంటున్నారు.
అదే విధంగా ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతోంది. పదకొండు వరకూ అంటే తొలి నాలుగు గంటలలో పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఈసారి ఉండవచ్చు అని అంటున్నారు. అలాగే ఆ తరువాత ఎంతో కొంత ఓటర్ల సందడి తగ్గినా తిరిగి మూడు నుంచి ఒక రేంజిలో పోలింగ్ కేంద్రాలు సందడి చేయవచ్చు అని అంటున్నారు.
క్యూలో ఉన్న చివరి ఓటరుకు ఎంత రాత్రి అయినా ఓటు వేసుకునే హక్కు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పడంతో సాయంత్రం ఈసారి పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏపీకి జన జాతరే కనిపిస్తుంది హైదరాబాద్ చెన్నై, అలాగే బెంగళూరు ఇతర సిటీలతో ఉన్న వారు వెల్లువలా తరలివస్తున్నారు అంటే ఓటింగ్ పట్ల వారికి ఉన్న నిబద్ధత తెలియచేస్తోంది.
ఈసారి ఎన్నారైలు కూడా పెద్ద ఎత్తున ఏపీ ఎన్నికా ప్రచార తెర మీద కనిపించారు. కొందరు అయితే పోటీ కూడా చేసారు. దాదాపుగా నెల రోజుల పాటు వారు ఉండి మరీ ఏపీలో జనాలను చైతన్య పరుస్తున్నారు. ఓటు హక్కు ఉన్న వారు వినియోగించుకుంటున్నారు. లేని వారు జనాలను చైతన్య పరుస్తున్నారు.
అదే విధంగా స్వచ్చంద సంస్థలు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు అని చెబుతూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇక ఎన్నికల సంఘం కూడా ఎటువంటి ఇబ్బందులూ పోలింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకోకుండా అన్ని రకాలైన ఏర్పాట్లూ చేసింది. దాంతో నీడ పట్టునే క్యూలు కట్టి జనాలు ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే దాహార్తిని తీర్చుకునేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు.
కాబ్ట్టి ఈసారి పోలింగ్ మాత్రం ఎండకు సైతం దడవకుండా సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది అని అంతా భావిస్తున్నారు. ఒక్క ఓటూ పొల్లు పోకూడదు అన్న లక్ష్యంలో ప్రజలు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే మూడు విడతలుగా జరిగిన పోలింగ్ ఒక స్థాయి వరకే సాగింది. నాలుగవ విడతలో భారీ పోలింగ్ అన్నది ఏపీ నుంచే మొదలవుతుందని అంటున్నారు. దాంతో అందరి చూపూ ఏపీ వైపే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీలో పోలింగ్ ఏ రకమైన సంచనాలు రేపుతుందో.