మంచు దెబ్బకు బ్రిటన్ వ్యాప్తంగా కరెంట్ కట్
సెకను పాటు కరెంట్ కట్ అయితేనే ఆగమవుతుందని చెప్పే దేశంలో రోజు మొత్తం మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటం చూస్తే.. మంచు తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
మారిన వాతావరణ పరిస్థితులు అగ్రరాజ్యాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేనంత భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. సంపన్న దేశాలైన బ్రిటన్ తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో మంచు తీవ్రతకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం మంచు తీవ్రత కారణంగా బ్రిటన్ మొత్తం విద్యుత్ సరపరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. సెకను పాటు కరెంట్ కట్ అయితేనే ఆగమవుతుందని చెప్పే దేశంలో రోజు మొత్తం మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటం చూస్తే.. మంచు తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
బ్రిటన్ తో పాటు జర్మనీలోనూ మంచు తీవ్రంగా కురిసిన కారణంగా జనజీవనం స్తంభించిదిపోయింది. విమాన రాకపోకల్ని నిలిపేశారు. బ్రిటన్ లో క్రీడా కార్యక్రమాలనని వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దు అయ్యాయి. సౌత్ ఇంగ్లండ్ లో ఎనిమిదో హెచ్చరికను జారీ చేశారు. మరో వారం మంచు బీభత్సం తప్పదంటున్నారు. జర్మనీలోనూ మంచు తీవ్రత కారణంగా బ్లాక్ ఐస్ వార్నింగ్ జారీ చేశారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని చెప్పటంతో పాటు.. ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టులో రాకపోకల్ని నిలిపేశారు.
అగ్రరాజ్యం అమెరికాలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకకపోవటమే మంచిదని సూచిస్తుననారు. కెంటకీ.. వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చలి పెద్దగా ఉండని రాష్ట్రాలుగా చెప్పే మిసిసిపీ.. ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడతాయన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే తాజా దుస్థితికి కారణంగా చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ.. బాల్టిమోర్.. ఫిలడెల్పియా నగరాల్ని మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా ఇతర ప్రాంతాల్లో ఐదు నుంచి పన్నెండు అంగుళాలు.. కాన్సాస్.. ఇండియానాల్లో ఇరవై అంగుళాల మేర మంచు పేరుకుంది. మంచు తీవ్రత ఎక్కువగా ఉన్న మరికొన్ని రాష్ట్రాల విషయానికి వస్తే.. మిస్సోరీ.. ఇల్లినాయి.. కెంటకీ.. వెస్ట్ వర్జీనీయాలు ఉన్నాయి. మంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.