ఒక ఎంపీ అయి ఉండి మరీ ఇలాంటి కక్కుర్తి ఏమిటి !
ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా వ్యవహరిస్తున్న జియావుర్ రెహమాన్ బర్క్ అడ్డంగా బుక్ అయ్యారు.
కక్కుర్తి కాకుంటే దీన్నేమనాలి. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. ఏకంగా పార్లమెంటు సభ్యుడు. అలాంటి ఆయన తన ఇంటికి విద్యుత్ చౌర్యం చేస్తున్న వైనాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించటమే కాదు.. తగిన రీతిలో శిక్ష వేస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా వ్యవహరిస్తున్న జియావుర్ రెహమాన్ బర్క్ అడ్డంగా బుక్ అయ్యారు.
సంభల్ నియోజకవర్గ ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయన తన ఇంటి విద్యుత్ సరఫరాకు అక్రమ పద్దతిలో విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. ఆయన విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు అందటంతో భారీ బందోబస్తుతో అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో నిర్వహించిన తనిఖీల్లో షాక్ తినే వాస్తవాలు వెలుగు చూశాయి. విద్యుత్ మీటర్లతో సంబంధం లేకుండా ఎంపీ ఇంటికి అధిక విద్యుత్తు సరఫరా జరుగుతున్న విషయాన్ని గుర్తించారు.
దీంతో.. పాత మీటర్లను తొలగించి.. రెండు కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు. అంతేకాదు.. విద్యుత్ చౌర్యానికి శిక్షగా రూ.1.91 కోట్ల ఫైన్ విధించారు. కేసు నమోదు చేయటమే కాదు.. ఆయన ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తనికీల సమయంలో అధికారులను బెదిరింపులకు పాల్పడినట్లుగా పేర్కొంటూ ఎంపీ తండ్రి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి వీడియో రికార్డును సాక్ష్యంగా జత చేర్చారు. ఒక ఎంపీ అయి ఉండి మరీ ఇలాంటి కక్కుర్తి ఏమిటంటూ విస్తుపోతున్న పరిస్థితి.