ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి... పవన్ కీలక ఆదేశాలు!

అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఇందులో భాగంగా... ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి.

Update: 2025-02-25 06:16 GMT

ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తుండటం.. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఘటనల సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అలాంటి ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రయత్నించినా.. పూర్తి సత్ఫలితాలు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

అవును... అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఇందులో భాగంగా... ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మృతులను వంకాయల దినేష్, చంగల్ రాయుడు, తుపాకుల మణమ్మగా గుర్తించారు. మరో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో... ఏనుగుల దాడి ఘటనపై ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అటవీశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన పవన్ కల్యాణ్... ఏనుగుల దాడిలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సమయంలో.. ఘటన జరిగిన వైకోటకు వెళ్లాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

కాగా... గత ఆగస్టులో పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా... కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం కర్ణాటక రాష్ట్ర పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బీ.ఖంద్రేతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు కుమ్కీ ఏనుగులు అవసరంపై పవన్ చర్చించినట్లు వార్తలొచ్చాయి.

భారతదేశంలో శిక్షణ పొందిన ఏనుగులకు ఉపయోగించే పదమే కుమ్కీ. అడవి ఏనుగులను ట్రాప్ చేయడానికి.. చిక్కుకున్న లేదా గాయపడిన అడవి ఏనుగులను రక్షించడానికి వీటిని వాడతారు. ఇదే సమయంలో... అడవి ఏనుగులు మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమి కొట్టడానికీ ఈ కుమ్కీలను వాడతారు!

Tags:    

Similar News