వైట్ హౌస్ ఎలాన్ మస్క్ కి గెస్ట్ హౌస్ నా?
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. దీంతో... మస్క్ కు ఎనలేని గౌరవంతో పాటు ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్. ట్రంప్ రెండో దఫా పాలనలో ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో తన నాలుగేళ్ల కుమారుడితో మస్క్ ఓవల్ ఆఫీసులో ప్రత్యక్ష మయ్యారు.
అవును... అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని ప్రెసిడెంట్ ఆఫీస్ ఓవల్ లో తన నాలుగేళ్ల కుమారుడితో ఎలాన్ మస్క్ కనిపించారు. ఈ సందర్భంగా... తండ్రీకొడుకులు కాసేపు సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే... వైట్ హౌస్.. అందునా ఓవల్ కార్యాలయం ఎలాన్ మస్క్ కి గెస్ట్ హౌస్ గా మారిందా అనే కామెంట్లు నెటిజన్లు పెడుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తోన్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ట్రంప్ ఆదేశించారు.
దీంతో... అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ప్రెసిడెంట్ ట్రంప్... డోజ్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. డోజ్ ను దావాలను పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లాలని మస్క్ కు సూచించారు. అనంతరం మస్క్ స్పందించారు.
ఇందులో భాగంగా... భారీ సంస్కరణల కోసమే ప్రజలు ట్రంప్ కు ఓటు వేశారని.. అదే ఇప్పుడు ప్రజలకు అందబోతోందని మస్క్ స్పందించారు. ఇదే సమయంలో... డోజ్ విభాగం సాధ్యమైనంత పారదర్శకంగా పనిచేసేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని.. ప్రధానంగా వృథా ఖర్చులు, అనవసర రిక్రూట్ మెంట్స్ ని తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుందని అన్నారు.
కాగా... ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ ఆయన పక్కనే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ట్రంప్ తో పాటు ఆయన నాలుగేళ్ల కుమారుడు కూడా శ్వేతసౌధంలో సందడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట సందడి చేస్తున్నాయి.