ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో.. మాజీ భార్యపై ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
ఈ వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన హక్కుల కార్యకర్త లారా లూమర్.. ఆష్లే సెయింట్ క్లేర్‌పై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.;

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన మాజీ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్లే సెయింట్ క్లేర్‌కు పుట్టిన బిడ్డ తన 13వ సంతానం కాదనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా తనకు లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొన్నేళ్ల క్రితం మస్క్, ఆష్లే ప్రేమలో ఉండగా వారికి ఒక మగ బిడ్డ జన్మించాడు. అయితే ఆ తర్వాత వారి బంధం ముగిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. మస్క్ ఆష్లేకు ఏటా 5 లక్షల డాలర్లు ఖర్చుల నిమిత్తం చెల్లిస్తున్నారు.
ఈ వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన హక్కుల కార్యకర్త లారా లూమర్.. ఆష్లే సెయింట్ క్లేర్‌పై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆష్లే తన అందంతో ధనవంతులను ఆకర్షిస్తుందని, లక్ష డాలర్ల విలువైన కారులో తిరుగుతూ కెమెరాకు చిక్కిందని లూమర్ ఆరోపించారు. ఆ కారును మస్క్ బహుమతిగా ఇచ్చారని ఆష్లే గర్వంగా చెప్పుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన బిడ్డ కోసమే ఆష్లే ఆ టెస్లా కారును అమ్ముకుంటున్నట్లు చెబుతున్న వీడియోను కూడా లూమర్ షేర్ చేశారు.
లూమర్ పోస్ట్‌పై స్పందించిన ఎలాన్ మస్క్.. ఆ బిడ్డ తన బిడ్డ కాదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. "ఆ బాబు నా బిడ్డా? కాదా? అనేది నాకు తెలియదు. అంతేకాదు.. ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవాలని నాకు లేదు. న్యాయస్థానం ఆదేశాలు కూడా అవసరం లేదు. నిజం ఏంటో తెలీదు కాబట్టి.. నేను ఇప్పటి వరకు ఆమెకు 2.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.21 కోట్లు) ఇచ్చాను. ఏటా 5 లక్షల డాలర్లు పంపాను" అని మస్క్ బదులిచ్చారు.
మస్క్ వ్యాఖ్యలపై ఆష్లే సెయింట్ క్లేర్ తీవ్రంగా స్పందించారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి పరీక్ష చేయించమని మస్క్‌ను కోరితే ఆయన వద్దన్నారని ఆమె కౌంటర్ ఇచ్చారు. "బిడ్డ కడుపులో ఉన్నప్పుడే టెస్ట్ చేయించమంటే.. నువ్వు వద్దన్నావు. నాకు డబ్బులు కూడా సక్రమంగా పంపటం లేదు. మన బిడ్డ కోసం పంపుతున్నావు.. నన్ను ఇబ్బంది పెట్టడానికి తక్కువ మొత్తం ఇస్తున్నావు. కానీ, నువ్వు నీ కొడుకును ఇబ్బందిపెడుతున్న విషయం మరిచిపోతున్నావు. సోషల్ మీడియాలో నా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నావు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదం ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. ఆష్లే సెయింట్ క్లేర్ తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. బిడ్డ సంరక్షణ కోసం ఆమె న్యూయార్క్ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మస్క్ తన బిడ్డను కేవలం మూడుసార్లు మాత్రమే కలిశాడని, బిడ్డ సంరక్షణలో అతడికి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి బయటపెట్టకుండా మస్క్ ప్రయత్నించారని కూడా ఆమె వెల్లడించారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అని వాదిస్తూ, గర్భం దాల్చిన సమయంలో తాను వేరే ఎవరితోనూ లైంగిక సంబంధం పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
మొత్తానికి ఎలాన్ మస్క్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరోసారి ఆయన వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.