ట్రంప్ టీంతో మస్క్ లడాయి.. మరో సీన్
తాజాగా ప్రపంచ కుబేరుడు.. ట్రంప్ టీంలో ముఖ్యుడైన ఎలాన్ మస్క్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.;

ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ట్రంప్ 2.0 సాఫీగా సాగేట్లుగా కనిపించట్లేదు. ఇప్పటికే వివాదాస్పద నిర్ణయాలతో రోజుకో సంచలనాన్ని క్రియేట్ చేస్తూ.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కానంతగా అనిశ్చితిని క్రియేట్ చేసిన ట్రంప్ రచ్చ ఒక ఎత్తు అయితే.. ఆయన కోర్ టీంలో పుట్టిన చిచ్చు.. ఎక్కడివరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా ప్రపంచ కుబేరుడు.. ట్రంప్ టీంలో ముఖ్యుడైన ఎలాన్ మస్క్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజా మండిపాటు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ‘యనో మూర్ఖుడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకూ అంత పెద్ద మాటను మస్క్ ఎందుకు అన్నట్లు? అన్న సందేహం రావొచ్చు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ మీద వైట్ హౌస్ సీనియర్ సలహాదారు పీటర్ మీడియాతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు.
ఎలాన్ మస్క్ కార్ల కంపెనీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘అది కార్ల తయారీ కంపెనీ కాదు. కేవలం అసెంబుల్డ్ చేసేది. బ్యాటరీలు.. ఎలక్ట్రానిక్స్.. టైర్లు లాంటి స్పేర్ పార్టలను జపాన్.. చైనా నుంచి తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేస్తారు. చౌకగా లభించే విదేశీ విడిభాగాలే ఆయనకు కావాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి అంత మాటలు అన్న తర్వాత మస్క్ ఊరుకుంటారా? తన నోటికి పని చెప్పారు.
తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన స్పందిస్తూ.. నవారో పెద్ద మూర్ఖుడని.. అమెరికాలో తయారయ్యే కార్లలో టెస్లాదే అగ్రభాగమన్న విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి ఈ రచ్చంతా ఎక్కడ మొదలైందంటే.. ట్రంప్ టారిఫ్ విధానంపై మస్క్ కు వ్యతిరేక అభిప్రాయం ఉంది. ముఖ్యంగా.. చైనాపై టారిఫ్ వార్ విషయంలో వెనక్కి తగ్గాలని మస్క్ సూచించగా.. అందుకు ట్రంప్ టీం ప్రతికూలంగా స్పందించింది. ఈ క్రమంలో మొదలైన మాటల యుద్ధం మరెక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.