స్టార్ గేట్ ప్రాజెక్టు పై మస్క్ సంచలన ట్వీట్.. సత్య నాదెళ్ల పై కీలక వ్యాఖ్య

స్టార్ గేట్ లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అంశంపై స్పందించిన ఎలాన్ మస్క్.. వారి దగ్గర అంత డబ్బు లేదంటూ విమర్శించటం సంచలనంగా మారింది.

Update: 2025-01-23 17:30 GMT

ఎప్పుడు ఏ విషయం మీద ఎలా రియాక్టు అవుతారో అర్థం కానట్లుగా ఉంటుంది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీరు. సమకాలీన ప్రపంచంలో నెంబరు వన్ స్థానంలో ఉండి.. బాహాటంగా రాజకీయాల గురించి మాట్లాడటమేకాదు.. తాను నమ్మిన దాని కోసం ఎంతవరకైనా వెళతానన్నట్లుగా వ్యవహరించే తత్త్వం ఆయన సొంతం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే అంశాన్ని అందరికి తెలిసేలా చేశారు. అలా అని.. ట్రంప్ అడుగులకు మడుగులు ఒత్తటం లాంటివి చేయరు.

తాజాగా స్టార్ గేట్ పేరుతో భారీ ఏఐ ప్రాజెక్టు మీద ట్రంప్ నిర్ణయం తీసుకోవటం.. దిగ్గజ సంస్థల్ని (ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు కలిసి) ఒక చోటుకు చేర్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న వైనంపై మస్క్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ మెగా ఏఐ ప్రాజెక్టుపై మస్క్ అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టార్ గేట్ లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అంశంపై స్పందించిన ఎలాన్ మస్క్.. వారి దగ్గర అంత డబ్బు లేదంటూ విమర్శించటం సంచలనంగా మారింది.

స్టార్ గేట్ ప్రాజెక్టుపై తన ఎక్స్ ఖాతాలో స్పందించిన మస్క్.. ‘వారి దగ్గర అంత డబ్బు లేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్సులు కనిపించట్లేదు’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ రియాక్టు అవుతూ.. మస్క్ చెప్పిందంతా అవాస్తవమని.. కావాలంటే ఒకసారి టెక్సాస్ కు వచ్చి.. నిర్మాణంలో ఉన్న తమ మొదటి సైట్ ను చూడాలని పేర్కొన్నారు.

ఈ ఇష్యూపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఒక మీడియా సంస్థ ప్రశ్నించగా.. తాము ప్రతి ఏడాది 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని.. ఈ మొత్తాన్ని అజ్యూర్ డెవలప్ మెంట్ కోసం.. ఓపెన్ ఏఐ మోడళ్లపై ఖర్చు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పెట్టుబడులపై తాము చాలా సంతోషంగా ఉన్నట్లుగా చెప్పిన సత్య నాదెళ్ల.. స్టార్ గేట్ ప్రాజెక్టును ప్రత్యక్షంగా ప్రస్తావించకున్నా.. ‘ఇతరుల పెట్టుబడుల గురించిన వివరాలు నాకు పూర్తిగా తెలియవు’ అంటూ వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించిన వీడియోపై మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘సత్య వద్ద కచ్ఛితంగా ఆ డబ్బు ఉంది’ అని పేరకొనటం గమనార్హం. ఓవైపు ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేస్తున్న స్టార్ గేట్ ప్రాజెక్టు మీద సందేహాలు వ్యక్తం చేసిన మస్క్.. సత్య నాదెళ్ల దగ్గర మాత్రం అంత డబ్బులు ఉన్నాయని పేర్కొనటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. ఈ స్టార్ గేట్ ప్రాజెక్టులో భాగంగా క్యాన్సర్ ను సైతం నయం చేసేలా ఈ ప్రాజెక్టును తీసుకురానున్నారు.

Tags:    

Similar News