రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికానే కారణం.. మస్క్ సంచలనం!
రష్యా చేసినది ఉక్రెయిన్ పై దాడి కాదని.. పుతిన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలన, అనాలోచిత నిర్ణయాలపై చేసిన దాడి అని సాచ్స్ పేర్కొన్నారు.
రెండున్నరేళ్లుగా జరుగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. పైగా ఉత్తర కొరియా సైనికులూ రష్యా తరఫున యుద్ధంలోకి దిగుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ కు ఆయుధాల సాయం చేస్తోంది అమెరికా సారథ్యంలోని నాటో కూటమి. అసలు ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు యుద్ధానికి దిగింది..? దీనికి సమాధానం.. తమ పొరుగున ఉండే ఉక్రెయిన్ తమకు బద్ధ శత్రువైన నాటో కూటమిలో చేరాలనుకోవడమే. నాటో కూటమి గనుక ఉక్రెయిన్ లో తిష్ట వేస్తే అది ఎప్పటికైనా తనకు ముప్పు అనేది రష్యా ఆలోచన. దీంతోనే ఏమాత్రం సంకోచం లేకుండా ఉక్రెయిన్ పై ‘సైనిక చర్య’ చేపట్టింది.
ఉక్రెయిన్ లొంగలేదు.. నష్టపోయింది
రష్యా వంటి పెద్ద దేశంతో తలపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. సొంతంగా ఆత్మవిశ్వాసంతో ఉంటూనే పాశ్చాత్య దేశాలు, నాటో దేశాల ఆయుధ సాయంతో రష్యాపై పోరాడుతోంది. కాకపోతే.. రష్యాకు తమ 40 శాతం భూభాగాన్ని కోల్పోయింది. దాదాపు ఏడాదిన్నర కిందటే ఈ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం సేకరించిన రష్యా.. తమ దేశంలో కలిపేసుకుంది. ఇప్పుడు వీటిలో రష్యా నియమించిన అధికారుల పాలనే సాగుతోంది.
ఎగదోసింది ఎవరు?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అలా ఉండగానే గత ఏడాది అక్టోబరు నుంచి హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో ఈ రెండు యుద్ధాలు సమసిపోతాయని భావిస్తున్నారు. కాగా, అసలు ఉక్రెయిన్ ను రష్యాపై ఎగదోసింది అమెరికానే అంటున్నారు అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్స్. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి అమెరికానే కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. సాచ్స్ మాట్లాడిన వీడియోను తాజాగా ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇది ఇంట్రస్టింగ్ టాపిక్ అంటూ పేర్కొన్నారు.
ఈ వీడియోలో సాచ్స్.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యూఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. రష్యా దూకుడు కంటే నాటో విస్తరణ అసలు వివాదానికి కారణమని కూడా చెప్పారు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవాలనుకున్న అమెరికా విధానమే రష్యా సైనిక చర్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై కాదు.. బైడెన్ పై దాడి..
రష్యా చేసినది ఉక్రెయిన్ పై దాడి కాదని.. పుతిన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలన, అనాలోచిత నిర్ణయాలపై చేసిన దాడి అని సాచ్స్ పేర్కొన్నారు. ఈ వీడియోను మస్క్ ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. అమెరికా, నాటోలు ఉక్రెయిన్ పై యుద్ధానికి ఎలా కారణమయ్యాయో సాచ్స్ వివరించారు అని చెప్పారు.