ఏపీ డీజీపీగా ఎవరు? అవకాశం దక్కేదెవరికి?

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర సీఎస్ ముగ్గురు అధికారుల పేర్లను పంపాల్సి ఉంటుంది.

Update: 2024-05-06 04:42 GMT

ఏపీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ.. అధికారపక్షం ఆరోపణలు.. విపక్ష విమర్శలతో వాతావరణం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార పక్షంఅధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని.. అందుకు కొందరు కీలక అధికారులతో పాటు.. ఉన్నతాధికారులపైనా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘానికి డైలీ బేసిస్ లో ఫిర్యాదులు అందుతున్నాయి. ఏపీలోని పరిస్థితులకు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ రెడ్డి తీరును తప్పు పడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేయటం తెలిసిందే.

ఏపీ డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందిన నేపథ్యంలో.. వాటిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఏపీ డీజీపీపై బదిలీ వేటు పడటంతో ఆయన స్థానం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర సీఎస్ ముగ్గురు అధికారుల పేర్లను పంపాల్సి ఉంటుంది. దీంతో.. ఆ మూడు పేర్లు ఎవరివి అయ్యే వీలుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ చర్చలో మూడు పేర్లు తెర మీదకు వచ్చాయి. ఈ ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపుతారని భావిస్తున్నారు.

సీనియర్ అధికారుల అంచనా ప్రకారం.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందంటున్నారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియార్టీ లిస్టులో రెండోస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న అంజనా సిన్హా (ఆమెది 1990 బ్యాచ్).. మూడో స్థానంలో ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ (ఆయన 1991 బ్యాచ్) పేర్లను పంపే వీలుందంటున్నారు. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏదైనా పేరుకు బదులుగా పంపే అవకాశం.. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తాకు ఉండొచ్చంటున్నారు. ఈసీకి పంపే పేర్ల వివరాలు ఈ రోజు వెల్లడయ్యే వీలుంది.

Tags:    

Similar News