రీల్ కాదు రియల్: పెరోల్ పై బయటకు.. తర్వాత ఎస్కేప్

తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. మహిళ మర్డర్ కేసులో ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Update: 2024-08-11 05:49 GMT

సినిమాలోని కొన్ని సీన్లు చూసినప్పుడు వాస్తవానికి ఎంత దూరంగా ఉంటున్నాయని మధన పడేవారు బోలెడంత మంది కనిపిస్తారు. తాజాగా కొన్ని ఉదంతాలు వెలుగు చూసినప్పుడు.. ఇలా కూడా జరగటమా? అంటూ అవాక్కు అయ్యే పరిస్థితి.

తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. మహిళ మర్డర్ కేసులో ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సదరు ఖైదీ 2020లో పెరోల్ మీద తాత్కాలికంగా బయటకు వెళ్లాడు. కట్ చేస్తే.. ఇప్పటివరకు మళ్లీ తిరిగి రాలేదు. అయినా.. ఎలాంటి కేసు నమోదు కాకపోవటం విశేషం. 2020లో పరారైతే.. 2024లో హైకోర్టు ఇచ్చిన అనూహ్య ఆదేశంతో ఇతగాడు ఎస్కేప్ అయిన విషయం బయటకు రావటం షాకింగ్ గా మారింది. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత అతడిపై కేసు నమోదైంది. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శాంతమ్మ అనే మహిళను ఆటో డ్రైవర్ వడ్డే రాజు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అతడికి కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. అయితే.. దీనిపై అప్పీలుకు వెళ్లటం.. అతడిపై ఇతర నేరాలు ఏమీ లేకుంటే అతడ్ని తక్షణం విడుదల చేయాలంటూ హైకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.

ఈ క్రమంలో అతడ్ని జైలు నుంచి విడుదల చేసేందుకు వివరాల్ని సేకరించే వేళలో.. షాకింగ్ నిజం బయటకు వచ్చింది. 2014 నుంచి జైల్లో ఉన్న రాజు.. వ్యక్తిగత బాండ్ సమర్పించి 2020 అక్టోబరు 17న నెల రోజుల పాటు జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చాడు. అనంతరం మహబూబ్ నగర్ పోలీసు సూపరింటెండెంట్ సిఫార్సు మేరకు డిసెంబరు వరకు అతడి పెరోల్ ను పొడిగించారు.

కట్ చేస్తే.. ఆ తర్వాత అతడు తిరిగి జైలుకు రాలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. సిత్రంగా రాజును పట్టుకొని అప్పగించాలంటూ మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 2024 ఫిబ్రవరి 14న జైలు అధికారులు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. అది కూడా కోర్టు నుంచి అతడ్ని విడుదల చేయాలన్న ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెక్ చేయగా.. అతడు జైల్లో లేకపోవటంతో ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Tags:    

Similar News