ఎంపీగా ఆయన పోటీ అక్కడినుంచేనా..? పార్టీ నేతను చికాకుపరుస్తారా?

బీజేపీకి తెలంగాణలో ప్రస్తుతం ముగ్గురు ఎంపీలున్నారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, కరీంనగర్ లో బండి సంజయ్.

Update: 2023-12-11 13:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో రెండేళ్ల కిందటి వరకు దూసుకొచ్చిన పార్టీ బీజేపీ.. ఏడాది కిందటి వరకు ఆ ఊపు కొనసాగింది.. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నికలో బోల్తాపడిందో.. మళ్లీ ఇక లేవ లేదు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. వాస్తవానికి గత అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి సంఖ్య 8కి పెరిగింది. అయితే, ఇవన్నీ ఉత్తర తెలంగాణలో వచ్చినవే. ఆ పార్టీ గెలిచిన సీట్లన్నీ అభ్యర్థుల ప్రభావంతోనే అనే వాదన ఉంది.

ఎంపీలు ముగ్గురూ ఓడారు..

బీజేపీకి తెలంగాణలో ప్రస్తుతం ముగ్గురు ఎంపీలున్నారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, కరీంనగర్ లో బండి సంజయ్. ఈ ముగ్గురూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే, మరో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అసలు బరిలోనే దిగలేదు. కేవలం నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. సిటింగ్ ఎంపీలు అందరికీ బీజేపీ టికెట్లిస్తుందని భావించాలి. ఎందుకంటే బాపూరావు, అర్వింద్, సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. ఎమ్మెల్యేలుగా కొనసాగేవారు. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఎంపీలుగానే పోటీ చేయాలి.

ఈయనా ఎంపీగానేనా.?

రెండు దశాబ్దాలు బీఆర్ఎస్ లో ఉండి.. మూడేళ్ల కిందట బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండేళ్ల కిందట హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ-బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడిన ఈ ఉప ఎన్నికలో ఈటల స్వల్ప మోజారిటీతో బయటపడ్డారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో మాత్రం ఈటల పరాజయం పాలయ్యారు. 20 ఏళ్లుగా అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన ఆయనకు ఇది షాకింగే. మరోవైపు ఈటల వంటి నాయకుడిని ఐదేళ్లు పదవిలో లేకుండా చూడలేం. వ్యక్తిగతంగానూ ఆయనకు ఇది సెట్ బ్యాక్. కాబట్టి బీజేపీ అధిష్ఠానం ఆయనను ఎంపీగా పోటీ చేయించే చాన్సు ఉంది.

కరీంనగర్ లోనేనా?

ఈటల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. హుజూరాబాద్ లోనే కాదు ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగానూ ఆయనకు బలం, బలగం ఉంది. తాజాగా ఈటల తాను ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కరీంనగర్ నే ఎంచుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడినుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సంజయ్ ను కాదని ఈటలకు బీజేపీ కరీంనగర్ టికెట్ ఇస్తుందా? సంజయ్ ను పార్టీ పదవితో సరిపెడుతుందా? అంటే చెప్పలేం. ఒకవేళ ఈటల మెదక్ నుంచి ఎంపీగా పోటీచేస్తారని భావించినా.. అక్కడ గెలుపు దుర్లభం. ఎందుకంటే.. ఒక్క సిద్దిపేటలోనే బీఆర్ఎస్ కు లక్ష ఆధిక్యం వస్తుంది. గజ్వేల్ దానికితోడుగా ఉండనే ఉంది. ఇలాంటి సమయంలో పోయిపోయి మెదక్ ను ఎంచుకుంటారా? మరోవైపు ఈటల.. సంజయ్ ను చికాకు పెట్టేందుకే ఎంపీగా (కరీంనగర్) పోటీ చేస్తాను అంటున్నారా? అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News