పార్టీలు మార్చినా.. ఫేట్ మార్చుకోలేక పోయారు!

కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం పార్టీలు మారినా.. ఫేట్ మార్చుకోలేని వారు ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Update: 2024-06-05 08:16 GMT

ఎన్నిక‌ల‌కు ముందు.. నాయ‌కులు స‌హ‌జంగానే పార్టీలు మారుతుంటారు. ఒక పార్టీలో వ్య‌తిక‌త ఉంద‌ని.. ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గింద‌ని భావించిన‌ప్పుడు స‌హ‌జంగానే నాయ‌కులు పార్టీలు మారుతుం టారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇలా.. ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అయితే.. ఇలా మారి గెలిచిన వారు కూడా.. ఉన్నారు. కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం పార్టీలు మారినా.. ఫేట్ మార్చుకోలేని వారు ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా తెలంగాణ‌ల ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపించింది. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందు.. బీఆర్ ఎస్ ప‌రిస్థితి బాగోలేద‌ని నాయ‌కులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. దీంతో ఎవ‌రికి వారు.. త‌మ అవ‌కాశం బ‌ట్టి.. పార్టీలు మారారు. సీట్లు కూడా ద‌క్కించుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రంగ‌ల్ పార్లమెంటును సీటు ను బీఆర్ ఎస్ పార్టీ క‌న్ఫ‌ర్మ్ చేసిన త‌ర్వాత కూడా... క‌డియం కావ్య .. ఆ సీటు త‌న‌కు వ‌ద్దంటూ... అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరి..అదేసీటును ద‌క్కించుకున్నారు. అయితే.. ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు.

కానీ.. ఇలానే మ‌రికొంద‌రు పార్టీలు మారి టికెట్‌లు ద‌క్కించుకున్నా.. ఓడిపోయారు. ఇలాంటి వారిలో బీబీ పాటిల్ ఒక‌రు.. ఈయ‌న బీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, తాజా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ పంచ‌న చేరారు. ఈ పార్టీ ఆయ‌న‌కు టికెట్ ఇచ్చింది. కానీ, ఓడిపోయారు. అలాగే ఆరూరి ర‌మేష్‌.. బీఆర్ ఎస్‌లో కీల‌క నాయ‌కుడు. కానీ, ఆ పార్టీపై అప‌న‌మ్మ‌కంతో ఆయ‌న కూడా... బీజేపీలో చేరి.. వరంగ‌ల్ నుంచి పోటీ చేశారు.. కానీ, కాంగ్రెస్ అభ్య‌ర్థి కావ్య చేతిలో ఓడిపోయారు.

ఇక‌, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కూడా.. విజ‌యం దక్కించుకోలేక పోయారు. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. కాంగ్రెస్ లో చేరిన ఆయ‌న టికెట్ తెచ్చుకున్నా.. ప్ర‌జ‌ల ఓట్లు మాత్రం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, 2019లో బీఆర్‌ఎస్ నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు ఈ సారి బీజేపీ త‌ర‌ఫున త‌న కుమారుడు భ‌ర‌త్‌ను పోటీకి పెట్టినా... ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఆద‌రించ‌లేదు.

కీల‌క‌మైన మ‌ల్కాజిగిరిలోనూ.. బీఆర్ ఎస్ ఓడిపోయింది. ఇక్క‌డ అసెంబ్లీ స్థానాలు మెజారిటీగా బీఆర్ ఎస్ ద‌క్కించుకున్నా.. ఎంపీ స్థానంలో మాత్రం చ‌తికిల ప‌డింది. నాగ‌ర్ క‌ర్నూలు నుంచి బీఎస్పీ ఒక‌ప్ప‌టి అధ్య‌క్షుడు మాజీ ఐపీఎస్‌.. ఆర్ ఎస్ ప్ర‌వీణ్ బీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసినా..ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. ఇక‌, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డిని కూడా ఓడించారు.

ఇక‌, బీజేపీలో చేరితే గెలుపు ఖాయ‌మ‌ని అంచ‌నా వేసుకున్న గోమాస శ్రీనివాస్ కూడా.. కాంగ్రెస్‌ను వ‌దిలి వ‌చ్చారు. పెద్ద‌ప‌ల్లి నుంచి పోటీ చేశారు. కానీ, ఆయ‌నా ఓడిపోయారు. ఇక‌, సీతారాం నాయ‌క్ ప‌రిస్థితి కూడా.. ఇలానే ఉంది. ఈయ‌న బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. బీజేపీని న‌మ్ముకున్నారు. కానీ, మ‌హ‌బూబాబాద్‌లో ఓడిపోయారు.

Tags:    

Similar News