సీఎం సార్‌కు ఈవీఎం కష్టాలు.. మోడీనే టార్గెట్!
ఇక, మిజోరాంలో తొలి ఓటు వేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సీఎం జోరాం థంగా అనుకున్నారు.
ఈశాన్య రాష్ట్రం మిజోరాం సహా ఛత్తీస్ గఢ్‌లో ఈ రోజు(మంగళవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభ మైంది. ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడుతో ఎన్నికలు ప్రారంభం కాగా.. మిజోరాంలో ఈవీఎం కష్టాలతో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 20 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇక, మిజోరాంలోని మొత్తం 40 స్థానాలకు ఒక్కరోజే పోలింగ్ జరగనుంది.
అయితే.. ఛత్తీస్‌గడ్‌లో మరో అరగంటలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందనగా.. ఉదయం 6.30 గంటల సమయంలో సుక్మా జిల్లాలో(నక్సల్స్ ప్రభావిత ప్రాంతం) భూమిలో అమర్చిన ఐఈడీ పేలి పోయింది. దీంతో అదే మార్గంలో వెళ్తున్న జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ.. ఎన్నికలను నిలిపేసేది లేదని అధికారులు ప్రకటించారు.
ఇక, మిజోరాంలో తొలి ఓటు వేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సీఎం జోరాం థంగా అనుకున్నారు. ఉదయం 6.30 గంటలకే రాజధాని ఐజ్వాల్ లోని నార్త్-2 నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. సుమారు 45 నిమిషాలు వెయిట్ చేశారు. వేలిపై ఎన్నికల గుర్తు కూడా వేయించుకున్నారు. స్లిప్పు తీసుకుని ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లగా.. ఎంత సేపటికీ అది పనిచేయడం లేదు. దీంతో 20 నిమిషాలు వెయిట్ చేసినా ఫలితం కనిపించలేదు.
ఇక, లాభం లేదని భావించిన థంగా .. వెనుదిరిగారు. మరోసారి వస్తానని అధికారులకు చెప్పి.. స్థానికంగా ఉన్న తన పార్టీ ఎంఎన్ ఎఫ్ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ .. ఈ రెండు ఘటనలతో పోలింగ్ ప్రారంభం కావడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.