ఆసక్తి పెంచుతున్న బాబు బడ్జెట్
ఇక ఏపీ పరిస్థీతి చూస్తే విపత్కరమైనదే అని చెప్పాలి. ఆర్ధికంగా మరింతగా కృంగిపోతోంది. ఆదాయం అయితే తక్కువగా వస్తోంది. ఖర్చులు చూస్తే భారీగా ఉన్నాయి.
చంద్రబాబు నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన అనుభవం రాజకీయంగా అర్ధ శతాబ్దం అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఈ టెర్మ్ తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. అంతటి సుదీర్ఘమైన అనుభవం కలిగిన ముఖ్యమంత్రులు దేశంలో తక్కువ మందే ఉన్నారు.
ఇక ఏపీ పరిస్థీతి చూస్తే విపత్కరమైనదే అని చెప్పాలి. ఆర్ధికంగా మరింతగా కృంగిపోతోంది. ఆదాయం అయితే తక్కువగా వస్తోంది. ఖర్చులు చూస్తే భారీగా ఉన్నాయి. దాంతో పాటుగా ఎటు చూసినా అన్నీ హామీలే ఉన్నాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ బడ్జెట్ గురించి అంతా ఆలోచిస్తున్నారు.
ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ కి ఇది కొత్త. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా కూడా ఇదే తొలి అనుభవం. అయితే చంద్రబాబు వంటి అపారమైన అనుభవం కలిగిన వారు పక్కన ఉండడంతో పయ్యావుల బడ్జెట్ కూడా బాగానే ఉండొచ్చు అన్న చర్చ ఉంది.
ఈ బడ్జెట్ ఏకంగా మూడు లక్షలకు పై దాటుతుందా అన్నది ఒక చర్చ. మూడు లక్షలకు తక్కువ కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఆదాయం వచ్చే శాఖల మీద మంచి అంచనాలు ఉండాలి. అలాగే కేంద్ర సాయం మీద కూడా ఆశలు నమ్మకం ఉండాలి.
రానున్న కాలంలో ఆదాయం పెంచుకోవచ్చు అన్న ధీమా ఉండాలి ఇవన్నీ బడ్జెట్ లో ప్రతిఫలిస్తాయా అన్నదే చర్చగా ఉంది. ఈ బడ్జెట్ కంటే ముందే చంద్రబాబు ఆదాయం లేదు అని చెప్పడం ప్రారంభించారు. ఎన్నో చేయాలని అనుకునాం కానీ పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితి అని బాబు అంటున్నారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లికి వందనం, రైతు భరోసా వంటి పధకాలకు ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు ఉండి తీరాలని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాని మీదనే ఆయా వర్గాల చూపు ఉంది అని అంటున్నారు.
తల్లికి వందనం పధకం లబ్దిదారులే ఏపీలో ఏకంగా 85 లక్షల మంది ఉన్నారు. వీరంతా తల్లులు అన్న మాట. ఇక రైతుల ఖాతాల్లో అన్నదాతా సుఖీభవ నగదు బదిలీ కోసం కాచుకుని కూర్చున్న లబ్దిదారులు ఏకంగా 55 లక్షల పై చిలుకు ఉన్నారని అంటున్నారు. ఈ రెండూ కలిపి కూడితే కోటీ నలభై లక్షల మంది ఉన్నారని అంటున్నారు.
అంటే ఇంత పెద్ద ఎత్తున లబ్దిదారులు ఏపీలో కొత్త బడ్జెట్ కోసం చూస్తున్నారు అన్న మాట. ఇక పధకాలు అమలు చేస్తామని ప్రభుత్వం ఒక వైపు చెబుతోంది. కానీ అది మాటల కంటే కూడా బడ్జెట్ లో కేటాయింపులను బట్టే జనాలకు నమ్మకం వస్తుందని అంటున్నారు.
రైతులకు భరోసా పధకాన్ని మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. అలాగే తల్లికి వందనం నిధులను కూడా విడతలుగా ఇస్తారా అన్న చర్చ ఉంది. అలాగే 85 లక్షల మంది తల్లులు లబ్దిదారులుగా ఉన్నారని చెబుతున్నా నిబంధలను మార్గదర్శకాలను కొత్తగా తీసుకుంటే వారి సంఖ్య 65 లక్షలకు ఉంటుందని అంటున్నారు ఈ నంబర్ అయినా పెద్దదే.
ఏది ఏమైనా నిధులు లేవని చెబితే జనాలు ఎంత వరకూ అంగీకరిస్తారో తెలియదు. ఇక పధకాలు ఇస్తామని చెప్పినా బడ్జెట్ లో వాటి ఊసూ ప్రస్తావన లేకపోతే ఎవరూ విశ్వసించరు. పైగా కేటాయింపులు కూడా భారీగా కనిపించాలి. మొత్తానికి కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ పాలకులకు కత్తి మీద సాము అయితే అది ప్రజలల్లో మరీ ముఖ్యంగా లబ్దిదారులలో ఆసక్తిని బాగా పెంచుతోంది అని అంటున్నారు.