ఎగ్జిట్ పోల్స్ ఈవీఎంలను మేనేజ్ చేయడానికేనా ?
ఎగ్జిట్ పోల్స్ దేశంలో వెల్లువలా వచ్చి పడే కల్చర్ గత మూడు నాలుగు ఎన్నికల నుంచి మొదలైంది.
ఎగ్జిట్ పోల్స్ దేశంలో వెల్లువలా వచ్చి పడే కల్చర్ గత మూడు నాలుగు ఎన్నికల నుంచి మొదలైంది. అంతకు ముందు అలాంటిది ఏమీ లేదు. ఎగ్జిట్ పోల్స్ గురించి పాపులర్ చేసింది కూడా ఎన్నికల వ్యూహ కర్తలే. జనాల మనసులో తమ అభిప్రాయాలను చొప్పించడానికి ప్రీ పోల్ సర్వేలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ హల్ చేసే సంస్థలు పోలింగ్ రోజు జనాల అభిప్రాయం తీసుకున్నామని చెబుతూ ఎగ్జిట్ పోల్స్ ని నిర్వహించడం మొదలెట్టాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయన్నది పక్కన పెడితే ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ కంటే వీటికే ఎక్కువ ఆసక్తి ఉండేలా చూసుకోవడంలో మాత్రం చాలా సంస్థలు సక్సెస్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ అసలు ఎందుకు అన్న చర్చకు తెర లేస్తోంది. వాటి వల్ల ఉపయోగం ఏమిటి అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ తరువాత కేవలం ఒకటి రెండు రోజుల తేడాలో అసలు ఫలితాలు వస్తాయి. మరి ఈ రెండు రోజులలో ఎవరిని సంతోషపెట్టడానికి అన్న ప్రశ్నలు కూడా బోలెడు కలుగుతాయి. అయితే కార్పోరేట్ కల్చర్ లోకి ఎన్నికలు వెళ్ళాక ప్రతీదీ బిజినెస్ ఫోకస్డ్ గానే చేస్తూ పోతున్నారు.
ఈ నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ కి కూడా అర్ధాలు పరమార్ధాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఈవీఎంలను మానేజ్ చేయడానికా అన్నట్లుగా దేశంలో ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి ఈసారి చూస్తే ఒక్కటి అంటే ఒక్క ఎగ్జిట్ పోల్ నిజం కాలేదు. దాదాపుగా అన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనికి నేషనల్ మీడియా ఏ విధంగా సమర్ధించుకుంటుందో తెలియదు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే అసలు ఫలితాలకు దరిదాపులలోకి కనీసంగా కూడా రాలేదు అని చెప్పక తప్పదు.
అదే టైం లో ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వచ్చాయంటే ఈ లోపల ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి చూస్తున్నారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎలా వచ్చినా ఈవీఎంలలో మాత్రం తమకు వీలుగా మేనేజ్ చేసుకునే విధానాన్ని అమలు చేసుకునే వెసులుబాటు దొరుకుతోంది అని అంటున్నారు.
అసలు ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చా అంటే దాని మీద కూడా అనుకూలంగా ప్రతికూలంగా చర్చ సాగుతోంది. చేయవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు. తమకు ఎక్కడ ఏమైనా ఇబ్బది ఉంటే ఆయా చోట్ల మేనేజ్ చేసుకుని ఒడ్డున పడే విధంగానూ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ని వాడుకుంటున్నారు అని అంటున్నారు.
నిజానికి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఓటర్ల మనోభావాలను ఎంతో కొంత బయటపెడతాయని చెబుతారు. అలా కనుక తమ పెర్ఫార్మెన్స్ ఎక్కడైనా పూర్ గా ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్య ఆ చివరి రెండు రోజులను పూర్తి ఫలవంతంగా ఉపయోగించుకుంటారా అన్న డౌట్లు వస్తున్నాయట.
అసలు నేషనల్ మీడియా ఎందుకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తోంది ఎవరి కోసం అంటే ఇంత కంటే వేరే ప్రయోజనాలు అయితే లేవు అని అంటున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం మీద ఒక వైపు చర్చ జరుగుతున్న వేళ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అందులో ఎంత వాటాను అందుకుంటున్నాయన్న చర్చ కూడా సాగుతఓంది.
గెలుస్తామని చెప్పడం కాదు ఎన్ని గెలుస్తామని చెబితే దానిని బట్టి ఇబ్బంది ఉన్న చోట్ల సర్దుబాట్లు దిద్దుబాట్లకు వీలుగానే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉంటున్నాయా అన్నది కూడా సందేహంగా ఉందని అంటున్నారు. కాదేదీ అక్రమానికి అనర్హం అని చెబుతారు.
ఏ విధానమూ పూర్తిగా లోపాలు లేకుండా ఉండదు, బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ అంటే అందులో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. అదే టైంలో ఈవీఎంల విషయంలో దానికి మించి శతకోటి సందేహాలు ఉన్నాయి. డెవలప్మెంట్ పెరిగి ఈ విధంగా ఎన్నికలలో కార్పోరేట్ కల్చర్ వెర్రి తలలు వేస్తున్న క్రమంలో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వల్ల లాభాలు ఏంటి అంటే అంతా ఇక్కడికే ఇదే రకమైన ఆలోచనలకే రావాల్సి వస్తోంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎన్నికలకు సర్వేలకు అలాగే సర్వేలకు ఎగ్జిట్ పోల్స్ కి ఆ మీదట ఎగ్జిట్ పోల్స్ కి ఈవీఎంల మానేజ్మెంట్ కి మధ్య విడదీయలేని విష బంధం ఏమైనా ఉందేమో అన్నది ప్రజాస్వామ్య ప్రియుల సందేహం. ఈ సందేహం విలువ వెల కట్టలేనిది. జవాబు చెప్పేవారు ఉంటే మాత్రం అది అద్భుతమే అవుతుంది.