వివాహేతర సంబంధం నేరం.. సుప్రీం తీర్పు పక్కకు వెళ్లనుందా?
వ్యభిచారం.. వివాహేరత సంబంధాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ కీలక సవరణలు చేసిన వైనం బయటకు వచ్చింది.
కీలక అంశానికి సంబంధించిన చట్టం మారనుందా? గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా కొత్త న్యాయ బిల్లుపై కసరత్తుచేస్తున్న పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497ను మళ్లీ నేరంగా పరిగణించాలని పేర్కొన్న పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు ఇప్పుడు చర్చనీయాంశంగా మారనుంది. వ్యభిచారం.. వివాహేరత సంబంధాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ కీలక సవరణలు చేసిన వైనం బయటకు వచ్చింది.
దీనికి సంబంధించిన రిపోర్టును కేంద్రానికి సమర్పించింది పార్లమెంటరీ ప్యానెల్. వివాహ వ్యవస్థ పవిత్రమైనదని.. దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లుపై తన నివేదికను కేంద్రానికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. జండర్ న్యూట్రల్ కింద.. వ్యభిచారం.. వివాహేతర సంబంధాన్ని నేరంగా.. ఈ కేసుల్లో స్త్రీ పురుషులకు సమాన బాధ్యత వహించేలా ఉండాలని కోరినట్లుగా చెబుతున్నారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను తీసుకురావాలని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అంశాలపై నివేదిక కోరుతూ పార్లమెంటరీ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి పంపారు. దీనికి సంబంధించిన నివేదికను తాజాగా కేంద్రానికి ఇచ్చారు.
గతంలో వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబరులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఒక ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం.. వ్యభిచారం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధంగా స్పష్టం చేసింది. మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛనుహరిస్తున్న సెక్షన్ ను కాలం చెల్లిందిగా పేర్కొంటూ.. రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇప్పుడు అందుకు భిన్నంగా వివాహేతర సంబంధం.. వ్యభిచారం నేరంగా మారుస్తూ కీలక సిఫార్సులు చేయటం గమనార్హం.