ఈ టీడీపీ ఎన్నారై కన్వీనర్ ఫేక్... చేసిన నేరాలు చూస్తే తగులుతుంది షాక్!

ఈ సమయంలో... నకిలీ బ్యాంక్ రిసీప్ట్ లు పంపించి, సాయం అందేసింది అన్నట్లుగా నమ్మబలికేవాడు. అనంతరం.. బ్యాంక్ మేనేజర్ లా ఫోన్ చేసేవాడు.

Update: 2025-01-21 09:39 GMT

తెలుగుదేశం పార్టీ ఎన్నారై కన్వీనర్ నంటూ పెద్ద ఎత్తున ప్రజలను మోసగించిన ఓ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇతడు సాగించిన దందా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల నుంచి చాకచక్యంగా దోచుకున్న సొమ్ము లెక్క ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అవును... శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కోండూరి రాజేష్ (34) అనే వ్యక్తి ఎక్స్ వేదికగా వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తామంటూ పోస్టులు పెట్టేవాడు. దీనికోసం హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ సీబీఎన్, హెల్ప్ ఎట్ పవన్ కల్యాణ్ వంటి హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించేవాడు. దీంతో... ప్రజలు నమ్మేవారు!

ఈ సమయంలో వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైనవారి వివరాలను తొలుత సేకరించిన రాజేష్.. అమెరికాకు చెందినదిగా కనిపించే ఫోన్ నెంబర్ తో వాట్సప్ లో వారిని సంప్రదించేవాడు. ఈ సందర్భంగా తనను తాను టీడీపీ ఎన్నారై కన్వీనర్ గా పరిచయం చేసుకునేవాడు.. వారి వైద్య చికిత్సల కోసం సాయం చేస్తామని నమ్మబలికేవాడు.

ఈ క్రమంలో.. వారికి మరింత నమ్మకం కలిగించే కార్యక్రమాల్లో భాగంగా.. తన వాట్సప్ డీపీగా నారా లోకేష్ ఫోటో పెట్టుకునేవాడు. ఈ సమయంలో... నకిలీ బ్యాంక్ రిసీప్ట్ లు పంపించి, సాయం అందేసింది అన్నట్లుగా నమ్మబలికేవాడు. అనంతరం.. బ్యాంక్ మేనేజర్ లా ఫోన్ చేసేవాడు. విదేశాల నుంచి వస్తున్న సొమ్ము మీ అకౌంట్ లో జమ అవ్వాలంటే చార్జీలు పంపాలని చెప్పేవాడు.

దీంతో... నిజమని నమ్మిన బాధితుల్లు అడిగిన సొమ్మును అతడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేవారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన తొమ్మిది వ్యవహారాల్లో రూ.54.34 లక్షల మేర ప్రజల నుంచి కొల్లగొట్టాడు. వీటిపై ఏపీలో ఏడు కేసులు, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇతడిపై అందిన ఇంకా 7 ఫిర్యాదులు మిగిలే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News