ఫేక్ ఫోటోలపై ప్రచారం ఇంత ఆలస్యంగానా రేవంత్?

అచ్చ తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది. సమకాలీన రాజకీయాలకు అతికినట్లుగా ఉంటుంది.;

Update: 2025-04-05 08:14 GMT
ఫేక్ ఫోటోలపై ప్రచారం ఇంత ఆలస్యంగానా రేవంత్?

అచ్చ తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది. సమకాలీన రాజకీయాలకు అతికినట్లుగా ఉంటుంది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదం విషయంలో రేవంత్ సర్కారు మీద తప్పుడు ప్రచారం చేసిన వైనం.. నిజాన్ని చెప్పే వేళకు.. అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చిన వైనం సంచలనంగా మారింది. ‘‘నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరు చుట్టి వస్తుందన్న సామెత’కు తగ్గట్లే..కంచె గచ్చిబౌలిలో పదుల కొద్దీ నెమళ్లు.. పెద్ద ఎత్తున జింకలు జేసీబీల ధాటికి పరుగులు తీస్తున్నట్లుగా కలర్ ఫుల్ గ్రాఫిక్స్ లో వైరల్ చేసిన వైనం పెను సంచలనంగా మాటమే కాదు.. రేవంత్ సర్కారుకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చింది.

నగరీకరణ భారీగా ఉండే కంచె గచ్చిబౌలి (నానక్ రాం గూడలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. అదేనండి ఐఎస్ బికి కూతవేటు దూరంలో)లో ఉన్న 400 ఎకరాల భూమిని చదును చేసి.. వేలం నిర్వహించాలని రేవంత్ సర్కారు భావిస్తే.. దాన్ని దెబ్బ తీసేందుకు పర్యావరణం.. మూగజీవాల పేరుతో చేసిన అసత్య ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టే విషయంలో రేవంత్ సర్కారు అడ్డంగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు క్రియేట్ చేసిన కంటెంట్ పెద్ద ఎత్తున వైరల్ చేయటంలో సక్సెస్ అయ్యారు.

ఈ తప్పుడు ప్రచారాన్ని ఆదిలోనే అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కారు వైఫల్యం చెందిందని చెప్పాలి. ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అస్త్రాల్ని సిద్ధం చేసుకునే రాజకీయ ప్రత్యర్థుల చురుకుదనం.. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి.. పార్టీ నేతలకు.. వారి వర్గీయులకు లేకపోవటం ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకాంశంగా చెప్పాలి. దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా.. ప్రపంచం మొత్తం తప్పుడు ఫోటోలు వైరల్ అయి.. అబద్ధాన్ని నిజమని పూర్తిగా నమ్మేసి.. కోర్టుల నుంచి కఠిన ఆదేశాలు వచ్చిన తర్వాత కానీ రేవంత్ సర్కారు ఉలిక్కిపడినట్లుగా చెబుతున్నారు.

తాజాగా ప్రభుత్వం మూడు ఫోటోల్ని విడుదల చేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన ఈ ఫేక్ ఫోటోల్లో మూగజీవాలకు 400 ఎకరాల్ని చదును చేసే క్రమంలో ఎంతో నష్టం జరిగిందన్న ప్రచారంలో నిజం లేదని.. ఆ ఫోటోలేవీ వాస్తవాలు కావంటూ ప్రకటన విడుదల చేసింది. ఇదే పని.. ఫేక్ ఫోటోలు వైరల్ అయ్యే టైంలోనే కౌంటర్ ఇచ్చి ఉంటే.. ప్రభుత్వానికి పెను డ్యామేజ్ తప్పేదంటున్నారు. ఏమైనా.. ఫేక్ ఫోటోల్ని వైరల్ చేసే విషయంలో రాజకీయ ప్రత్యర్థులు విజయం సాధిస్తుంటే.. అబద్ధాన్ని అబద్ధమని చెప్పే విషయంలో రేవంత్ సర్కారు ఫెయిల్ కావటం సంచలనంగా మారింది. ఈ తరహా ఉదంతాలు భవిష్యత్ లో రిపీట్ కాకూడదంటే.. రేవంత్ టీం మరింత యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News