పడిపోయిన జననాల రేటు.. జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటన
కొత్త జననాల రేటు బాగా తగ్గిపోవడంతో వృద్ధుల జనాభా ఎక్కువ అవుతోంది.
చైనా, భారత్, ఇండోనేసియా, బ్రెజిల్ వంటి దేశాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతుంటే మరికొన్ని దేశాల్లో మాత్రం రానురాను తగ్గిపోతోంది. దీంతో ఆ దేశాలు బెంబేలెత్తుతున్నాయి. కొత్త జననాల రేటు బాగా తగ్గిపోవడంతో వృద్ధుల జనాభా ఎక్కువ అవుతోంది. దీంతో ఈ ప్రభావం తమ అభివృద్ధిపై ఎక్కడ పడుతుందోనని ఆ దేశాలు బెంబేలెత్తుతున్నాయి.
ఇప్పుడు దక్షిణ కొరియా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధిని సాధించింది. శాంసంగ్, ఎల్జీ వంటి ప్రపంచ బ్రాండ్ కంపెనీలు దక్షిణ కొరియాకు చెందినవే.
ఇప్పుడు అలాంటి దక్షిణ కొరియాలో కొత్త జననాల సంఖ్య తగ్గిపోవడంతో ఆ దేశం ఆందోళన చెందుతోంది. చాలామంది మహిళలు మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా అభివృద్ధి చెందిన దేశం కావడంతో ఉద్యోగులు ఆ దేశంలో భారీగా ఉన్నారు. అందులోనూ మహిళా ఉద్యోగులే ఎక్కువ.
ఎక్కువ మంది చదువుకున్నవారు కావడం, అంతా ఉద్యోగాలు చేసేవారే కావడంతో ఇంటి పట్టున ఉండేవారు చాలా తక్కువ. దీంతో మహిళలు తమ ఉద్యోగాలు, కెరీర్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వివాహాలను చాలా లేటుగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత కెరీర్ లో కుదురుకోవడానికి, ప్రమోషన్లు పొందడానికి, మంచి జీతాలు పొందడానికి మాతృత్వానికి దూరమవుతున్నారు. ఉద్యోగాలే ధ్యేయంగా బతుకుతున్నారు. దీంతో గర్భవతులయ్యే మహిళల సంఖ్య దక్షిణ కొరియాలో బాగా పడిపోయింది.
ఉద్యోగాలు చేసే మహిళలు గర్భవతులయితే కంపెనీలు వారిని తొలగిస్తున్నాయి. అంతేకాకుండా వారి జీతాలను కూడా తగ్గిస్తున్నాయి. మామూలుగానే పురుషులతో పోలిస్తే మహిళలకు జీతాలు తక్కువే. అభివృద్ధి చెందిన దేశమే అయినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళలపై వివక్ష కొనసాగుతోంది. దీంతో మహిళా ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు.
దీంతో తమ ఉద్యోగాలను నిలుపుకోవడానికి, కెరీర్ లో ఎదగడానికి, అత్యధిక జీతాలను పొందడానికి మహిళా ఉద్యోగులు బిడ్డల్ని కనే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం సుదీర్ఘ పనిగంటలు తప్పడం లేదు. తరచూ ఓవర్ టైమ్ కూడా ఉండాల్సి వస్తోంది.
మరోవైపు పురుషులు కూడా ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కూడా అలసిపోయి ఇంటికి వస్తున్నారు. ఆ తర్వాత ఇంటిని పట్టించుకోవడం కానీ, బాధ్యతలను విషయంలోనూ బద్దకం చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగం పరంగా పనిభారం, ఇటు ఇంటి పని భారం, పిల్లలు వంటి వాటితో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దీంతో పిల్లల్ని కనడానికి మహిళలు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.
పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ లో బ్రేక్ పడితే మళ్లీ ఎదగడం కష్టమని మహిళా ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో బిడ్డల్ని కనడం వాయిదా వేసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా దక్షిణ కొరియాలో జీవన వ్యయం కూడా చాలా ఎక్కువే అని అంటున్నారు. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టమని చెబుతున్నారు. దీంతో భార్యభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇలా అనేక ప్రతికూలతల మధ్య పిల్లల్ని కనడం, పెంచడం తలకు మించిన భారంగా మారుతోందని సమాచారం. దీంతో మహిళలు బిడ్డల్ని కనడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. తమ కెరీర్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నారు.
దక్షిణ కొరియా మహిళలు బిడ్డల్ని కనడానికి ముందుకు రాకపోవడంతో జననాల రేటు భారీగా పడిపోయింది. గత 20 ఏళ్లలో ప్రపంచంలోని సంపన్న దేశాల్లో జననాల రేటు భారీగా పడిపోయిన దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది.
తాజాగా విడుదలయిన గణాంకాలు దక్షిణ కొరియాలో పరిస్థితిని తేటతెల్లం చేశాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి ఆ దేశ జనాభా సగానికి సగం తగ్గిపోతుందని అంటున్నారు. దీంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు పిల్లల్ని కనేలా మహిళలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివన్ని ప్రకటించినా మహిళలు అంతగా ముందుకు రావడం లేదని అంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరిస్తే జననాల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.