కశ్మీరీ పండిట్లు తిరిగి రావాల్సిన సమయమిదే.. ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్య

అందరూ కలిసి ఉండాలన్న ఐక్యతా సందేశం ఫరూక్ అబ్దుల్లా నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-10-13 11:30 GMT

ఇటీవల వెల్లడైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయాన్ని సాధించటం.. త్వరలోనే అక్కడ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్య చేశారు. ఇళ్లను వదిలేసి వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లు తిరిగి తమ ఇళ్లకు రావాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) కశ్మీరీ పండిట్లకు శత్రువు కాదన్నారు. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తుందన్న వ్యాఖ్యా చేశారు.

అందరూ కలిసి ఉండాలన్న ఐక్యతా సందేశం ఫరూక్ అబ్దుల్లా నుంచి రావటం ఆసక్తికరంగా మారింది. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తమ్ముళ్లు.. చెల్లెళ్లు తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తున్నా. అందుకు ఇప్పుడు టైం వచ్చింది. వాళ్లు సొంత గూటికి తిరిగి రావాలి. మేం కేవలం కశ్మీరీ పండిట్ల గురించే ఆలోచించటం లేదు. జమ్ము ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నాం. మేం వారిని బాగా చూసుకోవాల్సి ఉంటుంది’ అన్న వ్యాఖ్య చేశారు.

అదే సమయంలో జమ్ము ప్రజలు సైతం నేషనల్ కాన్ఫరెన్స్ తమ శత్రువు కాదన్న విషయాన్ని వారు విశ్వశించాలన్న ఫరూక్ అబ్దుల్లా.. ‘‘మనమంతా భారతీయులం. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని మేం కోరుకుంటున్నాం. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరించాలి. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తేనే రాష్ట్రం తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

కశ్మీరీ పండిట్లు 90వ దశకంలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న దశలో కశ్మీర్ లోయను విడిచిపెట్టి పారిపోవటం తెలిసిందే. ఇళ్లు.. ఆస్తుల్ని వదిలేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. జమ్ముకశ్మీర్ లో ప్రధాన సమస్య నిరుద్యోగమని.. జమ్ముకశ్మీర్ ను కలిపి ఉంచటానికే తాము ప్రాధాన్యత ఇస్తామన్న ఫరూక్ అబ్దుల్లా మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆయన పిలుపునకు కశ్మీరీ పండిట్ల స్పందన ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News