నిర్బంధం నుంచి.. బికినీ షో వరకు.. అందాల లోకం అరబ్ దేశం

తొలిసారిగా ఫ్యాషన్ షో అనేక సంస్కరణల మధ్య సౌదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. బికినీ ఫ్యాషన్ షో నిర్వహణకు అనుమతించింది.

Update: 2024-05-18 07:41 GMT

అరబ్ దేశాలంటే.. అత్యంత కఠిన నిబంధనలు. మహిళలపై మరింతగా ఆంక్షలు.. కొన్ని దశాబ్దాల కిందటివరకు కనీసం ఓటు హక్కు కూడా లేని వైనం.. అలాంటి అరబ్ దేశాలు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి. నియోమ్‌ పేరిట అతి భారీ ప్రాజెక్టును చేపట్టిన సౌదీ.. ఒక భవిష్యత్ నగరాన్నే నిర్మిస్తోంది. దీనికి ఎవరు అడ్డుగా నిలిచినా ప్రాణాలతో విడిచిపెట్టవద్దని హెచ్చరించింది. అంతేకాదు. సౌదీ తొలిసారిగా ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో పాల్గొనబోతోంది. సెప్టెంబరు 18న మెక్సికోలో జరగనున్న అంతర్జాతీయ పోటీలో, ఆ దేశం తరఫున 27 ఏళ్ల రూమీ అల్‌ కతానీ పాల్గొనబోతోంది. ఇలాంటి పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రియాద్‌ లో పుట్టిన రూమీ.. మోడల్‌, కంటెంట్‌ క్రియేటర్‌ గా పేరు తెచ్చుకుంది. నిరుడు బహ్రెయిన్‌ కు ప్రాతినిధ్యం వహిస్తూ, లుహానే యాకూబ్‌ అనే ముద్దుగుమ్మ మిస్‌ యూనివర్స్‌లో పాల్గొంది.

ఆదరణకు కొదవ లేదు రూమీ అల్‌ కతానీ సౌదీ మహిళల స్వయం స్వావలంబన కోసం ఎంతో కాలంగా కృషి చేస్తోంది. గతంలో, మిస్‌ ఏసియా ఇన్‌ మలేసియా, మిస్‌ అరబ్‌ పీస్‌, మిస్‌ యూరప్‌ మొదలైన ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. మిస్‌ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకుంది. ఇన్‌ స్టా గ్రామ్ లో పది లక్షల మంది ఫాలోవర్లున్నారు.

సంస్కరణలశీలి కారణంగానే..

సౌదీ యువరాజు 32 ఏళ్ల మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌ మహిళలకు ఎన్నో సౌలభ్యాలను కల్పించారు. 2017లో క్రౌన్‌ ప్రిన్స్‌గా ఎంపికైన ఈయన.. దేశంలో ఎన్నో ఆర్థిక, సామాజిక మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలను నడుపుతున్నారు. పురుషులతో సమానంగా బహిరంగ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పురుష గార్డియన్‌ అనుమతితో పనిలేకుండా పాస్‌ పోర్టులను పొందుతున్నారు.

సినిమాలు, మిక్స్‌డ్‌ జెండర్‌ వేడుకల మీద నిషేధాన్ని ఎత్తివేసిన సౌదీ అరేబియా, పాతకాలపు సంప్రదాయ నిబంధనల నుంచి బయటపడి, గణనీయమైన స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నారు.

తొలిసారిగా ఫ్యాషన్ షో అనేక సంస్కరణల మధ్య సౌదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. బికినీ ఫ్యాషన్ షో నిర్వహణకు అనుమతించింది. సెయింట్ రేగిస్ రెడ్ సీ రిసార్ట్ లో రెడ్ సీ ఫ్యాషన్ వీక్ పేరిట కార్యక్రమం చేపట్టింది. మహిళలపై అనేక ఆంక్షలు విధించే సౌదీ.. ఇప్పుడు మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో చాలా మార్పులను చూస్తోంది. కచ్చితంగా పాటించాల్సిందేనంటూ నిబంధనలను ఎత్తివేసింది.

Tags:    

Similar News