4 ఎకరాలు కొడిక్కి ఇస్తే తిండి పెట్టలేదు..కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా?
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లు. అందరికి పెళ్లిళ్లు చేశారు.
లక్షల రూపాయిలు విలువ చేసే తండ్రి ఆస్తి కావాలే కానీ.. ఆయన మాత్రం అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించే పిల్లలకు చెంపదెబ్బ లాంటి ఉదంతంగా దీన్ని చెప్పాలి. కని.. పెంచి పెద్దోళ్లను చేసిన పిల్లలు.. తల్లిదండ్రుల్నిపట్టించుకోకుండా వారి ఆస్తులు మాత్రమే తప్పించి.. వారు తమకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించే వారికి చెప్పుదెబ్బ లాంటి షాకిచ్చాడో తండ్రి. లక్షలాది రూపాయిల విలువ చేసే 4 ఎకరాలకు పైనే ఉన్న భూమిని కొడుక్కి ఇచ్చేసి.. చివరకు రైసు మిల్లులో గుమస్తాగా పని చేస్తున్న సగటు వ్యక్తి చేసిన లీగల్ ఫైట్ ఆసక్తికరంగానే కాదు.. స్ఫూర్తివంంతంగా మారిందని చెప్పక తప్పదు. అసలేం జరిగిందంటే..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లు. అందరికి పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ల క్రితం రాజకొంరయ్య భార్య చనిపోయింది. ఆ తర్వాత 2018లో తన కొడుకు రవికి గిఫ్టు డీడ్ రూపంలో 4.12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. భార్య మరణించిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు. రిజిస్ట్రేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నుంచి తండ్రి బాగోగుల్ని పట్టించుకోవటం మానేశాడు కొడుకు.
దీంతో విషయం పెద్ద మనషుల వద్దకు పంచాయితీగా వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఒకట్రెండుసార్లు తండ్రి మీద చెయి చేసుకున్నాడు కొడుకు. దీంతో మానసికంగా కుంగిపోయిన రాజకొంరయ్య.. తన కొడుక్కి ఇచ్చిన భూమి పట్టాను రద్దు చేయాలంటూ భీమదేవరపల్లి తహసీల్దార్.. హనుమకొండ ఆర్డీవో.. ముల్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు తనపై దాడి చేస్తారన్న భయంతో 75 ఏళ్ల ఆ పెద్ద వయస్కుడు కరీంనగర్ జిల్లాలోని ఒక రైసు మిల్లులో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.
రాజకొంరయ్య ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు సీనియర్ సిటిజన్ యాక్టు అమలు చేసి.. కొడుక్కి తండ్రి రిజిస్ట్రేషన్ చేసిన 4.12 ఎకరాల్లో 3.20 ఎకరాలభూమిని రద్దు చేశారు. తిరిగి ఆన్ లైన్ లో అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. తన బాగోగుల్ని పిల్లలు సరిగా చూసుకోకుంటే తన ఆస్తిని అనాధ శరణాలయానికి రాసిస్తానని.. పెద్ద వయసులో తల్లిదండ్రుల్ని చూసుకోవటం పిల్లల బాధ్యతగా పేర్కొన్నారు. తన లాంటి పరిస్థితి మరే తండ్రికి రాకూడదనే తాను పోరాడినట్లుగా పేర్కొన్నాడు. 75 ఏళ్ల వయసులో రైస్ మిల్లులో గుమస్తా.. నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్న అతడి దుస్థితిని చూసిన పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.