ప్రేమ పెళ్లి చేసుకుంటనన్న కూతుర్ని పెద్దల ముందే చంపేశాడు
పంచాయితీ పెద్దల మందే కాల్చి చంపేసిన వైనం మధ్యప్రదేశ్ లో జరిగింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఉదంతం గురించి విన్న తర్వాత.. వీడు తండ్రేనా? అన్న భావన కలుగక మానదు. విన్నంతనే ఉలిక్కిపడటమేకాదు.. మరీ ఇంత కిరాతం ఏమిటి? అన్న ఫీలింగ్ కలుగుతుంది. తాను ప్రేమించినోడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని.. ఇంట్లో వాళ్లు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోనన్న మాటలకు తీవ్ర ఆగ్రహానికి గురైన సైకో తండ్రి.. పంచాయితీ పెద్దల మందే కాల్చి చంపేసిన వైనం మధ్యప్రదేశ్ లో జరిగింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ దారుణ హత్యకు వేదికగా మారింది. ఇంట్లో వారు కుదిర్చిన పెళ్లిని చేసుకోలేనని.. అదే విషయాన్ని తండ్రి ఏర్పాటు చేసిన పెద్దల పంచాయితీలో చెప్పేసింది. దీనికి ముందు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేసిన ఆమె.. తన ప్రేమ గురించి.. తాను ప్రేమించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. తన ప్రేమను ఇంట్లో వారు ఒప్పుకోవటం లేదని.. ప్రేమించిన వ్యక్తి విక్కీని పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.తన ప్రాణాలకు ముప్పు వాటిల్లితే అందుకు తన కుటుంబానిదే బాధ్యతగా ఆమె ఆ వీడియోలో స్పష్టం చేసింది. తనకు భద్రత కల్పించాలని కోరింది.
ఈ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ సైతం అమ్మాయి తండ్రిని పిలవగా.. స్థానిక పెద్దలు తాము పంచాయితీ చేస్తామని.. ఇష్యూను పరిష్కరిస్తామని చెప్పారు. తన కుమార్తెతో మాట్లాడి ఒప్పిస్తానని.. అవకాశం ఇవ్వాలని తండ్రి కోరాడు. మరోవైపు బాధితురాలికి ఇష్టం లేని మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ముహుర్తాన్ని నిర్ణయించారు. నాలుగు రోజుల్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసిన వేళలో.. పెద్దల పంచాయితీ జరిగింది.
ఇందులో తాను ప్రేమించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని.. ఇంకెవరిని పెళ్లి చేసుకోనంటూ బాధితురాలు పదే పదే తేల్చి చెప్పింది. దీంతో.. తీవ్రఆగ్రహానికి గురైన ముర్ఖపు తండ్రి మహేశ్.. తన వద్ద ఉన్న నాటు పిస్టల్ తో ఆమె ఛాతీ మీద కాల్పులు జరిపాడు. అతడితో ఉన్న మహేశ్ బంధువు రాహుల్ సైతంవిచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో.. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. పంచాయితీకి వచ్చిన పెద్దలు ఈ ఉదంతంతో షాక్ కు గురయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.