తమిళనాడును అతలాకుతలం చేసిన మాయదారి ఫెంగల్!

జలప్రళయం అనే మాటను విని ఉంటారు. కానీ.. ఆ మాటకు తీవ్రత ఎంతలా ఉంటుందన్న విషయాన్ని తన చేతలతో చెప్పింది మాయదారి ఫెంగల్ తుపాను.

Update: 2024-12-03 05:34 GMT

జలప్రళయం అనే మాటను విని ఉంటారు. కానీ.. ఆ మాటకు తీవ్రత ఎంతలా ఉంటుందన్న విషయాన్ని తన చేతలతో చెప్పింది మాయదారి ఫెంగల్ తుపాను. దీని కారణంగా తమిళనాడు అతలాకుతలమైంది. దీని తీవ్రతకు చెన్నై మహానగర ఎయిర్ పోర్టు మూసివేతకు కారణం కావటంతో పాటు.. భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ మాయదారి తుపాన్ తీరం దాటినప్పటికి దీని ప్రభావం తమిళనాడులోని పలు ప్రాంతాల మీద ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తింది. దీంతో.. పలు చోట్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

కుండపోతగా కురిసిన వర్షాలతో రోడ్లు నదులుగా మారాయి. ఈ వరద పోటు తీవ్రత ఎంత ఎక్కువంటే పార్కుచేసిన బస్సులు.. లారీలు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి. నేషనల్ హైవే మీద వాహనాలు నిలిపితే సురక్షితంగా ఉంటాయని భావిస్తే.. బస్సులు.. లారీలు.. కార్లు వరద తీవ్రతకు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ తుపాను కారణంగా చెన్నై మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలో నుంచి బయటకు రాలేని దుస్థితి. తుపాను కారణంగా.. ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. ఆరుగురు ప్రాణాల్ని తీసింది. కొందరు గల్లంతైనట్లు సమాచారం. పెంగల్ తుపాను తీవ్రతకు తమిళనాడుతో పాటు.. దానిని అనుకొని ఉండే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడా ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది.

తుపాను తీరం దాటిన తర్వాత క్రిష్ణగిరి జిల్లా ఊత్తాంగరై ప్రాంతంలో ఆదివారం 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఎక్కూరు అమ్మన్ చెరువు కట్టలు తెగి దిగువకు వరద పోటెత్తింది. ఈ తుపాను కారణంగా ధర్మపురి.. సేలం.. విల్లుపురం.. నామక్కల్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక.. ధర్మపురి జిల్లాలో అన్నై సత్యానగర్.. ఆవిన్ నగర్.. నంది నగర్ ప్రాంతాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

విల్లుపురం జిల్లాలో తెన్ పెన్నై.. కోరైయారు వాగులు ఉధృతంగా ప్రవహించటంతో నాలుగు గ్రామాలు దీవులుగా మారిపోయాయి. భారీ వర్షాలు.. దాని కారణంగా పోటెత్తిన వరద సోమవారం సాయంత్రానికి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. తమిళనాడులోని ప్రసిద్ధ శైవక్షేత్రం తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో దంపతులతో పాటు ఏడుగురు శిధిలాల్లో చిక్కుకున్నారు. ఆరుగురు మరణించగా.. మరొకరిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అరుణాచలంపై 2668 అడుగుల ఎత్తున ఉండే మహాదీపాన్ని వెలిగించే శిఖర భాగం నుంచి హఠాత్తుగా బండరాళ్లు.. మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఇవన్నీ ఒక ఇంటిపై పడటంతో ఆ ఇంట్లో చిక్కుకుపోయిన ఏడుగురిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News