మస్క్ కొన్నాక 80 శాతం విలువ ఆవిరి

ముచ్చట పడి మరీ కొనుగోలు చేసిన ట్విటర్ పిట్టను తన ఇష్టానికి తగ్గట్లు ఎక్స్ గా పేరు మార్చేయటం తెలిసిందే.

Update: 2024-10-03 04:38 GMT

ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం ఫెడెలిటి. ఒకప్పటి ట్విటర్ ఇప్పటి ఎక్స్ కు సంబంధించిన సంచలన విషయాన్ని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం టార్గెట్ చేసి మరీ ప్రపంచ కుబేరుడు మస్క్ కొనుగోలు చేసిన నాటి ట్విటర్ విలువ ఇప్పుడు భారీగా పడిపోయినట్లుగా పేర్కొంది. ముచ్చట పడి మరీ కొనుగోలు చేసిన ట్విటర్ పిట్టను తన ఇష్టానికి తగ్గట్లు ఎక్స్ గా పేరు మార్చేయటం తెలిసిందే.

మస్క్ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే ప్రస్తుతం దాని విలువ 80 శాతం తగ్గినట్లుగా పేర్కొంది. మస్క్ చేతికి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో ఇంత భారీగా పడిపోయినట్లుగా పేర్కొంది. 2022 అక్టోబరులో ట్విటర్ ను మస్క్ స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఆ సమయంలో దాని విలువ 44 బిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో చెప్పుకోవాలంటే రూ.3.7 లక్షల కోట్లు.

ఆ తర్వాత ఎక్స్ఛేంజీల్లో ఎక్స్ షేరు ట్రేడ్ కాలేదు. ఫెడెలిటీ మాత్రం ఎక్స్ లో తనకున్న షేర్ల విలువను వెల్లడిస్తూ వస్తోంది. తాజా నివేదిక ప్రకారం తమ వద్ద ఉన్న ఎక్స్ షేర్లు 2022 అక్టోబరులో 19.66 మిలియన్ డాలర్లుకాగా 2024 ఆగస్టు చివరికు 4.2 మిలియన్ డాలర్లకు పతనమైనట్లు పేర్కొంది. అంతే.. 79 శాతం విలువ క్షీణించినట్లు. ఫెడెలిటీ లెక్కల ప్రకారం ఎక్స్ తాజా విలువ రూ.78వేల కోట్లు మాత్రమే అవుతుందని చెబుతున్నారు. మస్క్ కొనుగోలు చేసిన మొత్తంతో పోలిస్తే.. తాజా ధర చాలా చాలా తక్కువగా చెప్పాలి.

అయితే.. ఫెడెలిటీ అంచనాల్ని పలువురు విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఎక్స్ విలువ మస్క్ కొనుగోలు చేసిన దాని కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా ఎక్స్ విలువను 15 బిలియన్ డాలర్లకు చేరి ఉండొచ్చని వెడ్ బుల్ సెక్యూరిటీస్ ఎండీ డాన్ ఐవెస్ చెబుతుననారు. వినియోగదారులతో ఎక్స్ అనుసంధానం బలంగా ఉందని.. అయితే ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇంతకూ ఈ కన్ఫ్యూజ్ కు కారణం లేకపోలేదు. మస్క్ చేతికి వచ్చిన తర్వాత ఎక్స్ పబ్లిక్ కాస్తా ప్రైవేటుగా మారింది.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు ప్రతి మూడు నెలలకు తమ ఆర్థిక ఫలితాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఆ అవసరం లేదు. దీంతో.. ఎక్స్ విలువకు సంబంధించిన వివరాలు బయటకు రాని పరిస్థితి. అయితే.. వ్యాపార ప్రకటనదార్లను ఆకర్షించటంలో ఎక్స్ కష్టపడుతోందన్న మాట మార్కెట్ వర్గాల్లోనూ వినిపిస్తోంది . అదే సమయంలో ఎక్స్ కేవలం 4 శాతం బ్రాండ్ సేఫ్టీనే అందిస్తోందని.. గూగుల్ ఇచ్చే 39 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ప్రకటనదారులు భావిస్తున్నారు. ఏమైనా.. తాజా నివేదిక మస్క్ ఫెయిల్యూర్ ను చెబుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News