"ఆడుదాం-ఆంధ్రా"లో వివాదాలు... ఇవే అసలు కారణాలు!

అయితే... పట్టుకునే విధానం తప్పంటూ నాగటూరుకు చెందిన ఆతగాడు మొదలుపెట్టాడు. దీంతో మాటా మాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే వరకూ వెళ్లింది వ్యవహారం.

Update: 2024-01-12 11:21 GMT

యువతలో క్రీడా స్పూర్తి పెరుగుతుందని, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఏర్పడుతుందని, ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అనే మంచి ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా "ఆడుదాం-ఆంధ్రా" పోటీలు నిర్వహిస్తుంటే... పలు చోట్ల అవికాస్తా... వివాదాలకు, కొట్లాటలకు, ముష్టియుద్ధాలకూ దారితీస్తున్నాయి. దీంతో అసలు లక్ష్యం పక్కకుపోవడంతో పాటు సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయనే చర్చ మొదలైంది.

అవును... "ఆడుదాం-ఆంధ్ర" కార్యక్రమంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా... నాగటూరు, శాతనకోట గ్రామాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. ఈ సమయంలో నాగటూరు జట్టు నుంచి రైడింగ్‌ కు వెళ్లగా శాతనకోట జట్టు పట్టుకొని ఔట్‌ చేసింది.

అయితే... పట్టుకునే విధానం తప్పంటూ నాగటూరుకు చెందిన ఆతగాడు మొదలుపెట్టాడు. దీంతో మాటా మాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే వరకూ వెళ్లింది వ్యవహారం. అది ఆటగాళ్లతో ఆగకుండా... పోటీని చూడటానికి వచ్చిన ఆయా గ్రామాల జనాలు కూడా రంగంలోకి దిగారు. దీంతో ఏకంగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల క్రీడాకారులను చెదరగొట్టారు.

ఇదే సమయంలో అదే జిల్లా గోస్పాడులో నిర్వహించిన కబడ్డీ పోటీల్లోనూ దాదాపు సేం సీన్ రిపీట్ అయ్యింది. ఇందులో భాగంగా.. గోస్పాడు - కానాలపల్లె జట్ల మధ్య ఆట మొదలైంది. ఈ సమయంలో ఆట జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు చొక్కాలు పట్టుకొని ఒకరినొకరు తోసుకున్నారు.

దీంతో ఇరుజట్ల సభ్యులు కుర్చీలెత్తి వాగ్వాదానికి దిగి కలబడినంత పనిచేశారు! ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు సర్దిచెప్పగా... ఆ సర్దుబాటు నచ్చక కానాలపల్లె జట్టు సభ్యులు బహిష్కరించి వెళ్లిపోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో... ఇంత మంచి కార్యక్రమానికి మచ్చ ఏర్పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అయితే... తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల చాలాచోట్ల ఎవరంటే వారిని అంపైర్లుగా నియమించడంతో.. వారు సరైన నిర్ణయం తీసుకోలేదంటూ క్రీడాకారులు వివాదాలకు దిగుతున్నారు. ఫలితంగా... పలుచోట్ల క్రీడాకారులు కొట్టుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి!!

Tags:    

Similar News