వైసీపీని పూర్తిగా వీడిన సినీ గ్లామర్!
వైసీపీకి సినీ గ్లామర్ అన్నది చాలా తక్కువ అని అంతా ఒప్పుకుంటారు. టీడీపీ జనసేనల విషయానికి వస్తే అక్కడ నిండుగా సినీ గ్లామర్ కనిపిస్తుంది
వైసీపీకి సినీ గ్లామర్ అన్నది చాలా తక్కువ అని అంతా ఒప్పుకుంటారు. టీడీపీ జనసేనల విషయానికి వస్తే అక్కడ నిండుగా సినీ గ్లామర్ కనిపిస్తుంది. కానీ వైసీపీలో అది పెద్దగా ఉండదు. ఇక జగన్ వైసీపీని స్థాపించిన తొలి నాళ్లల్లో ఆ పార్టీ వైపు చూసిన వారిలో సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులు ఉన్నారు.
అలాగే సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి వంటి వారు మద్దతు తెలిపారు. ఇక ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ చందర్, అలాగే సీనియర్ హీరో భాను చందర్, మరో నటుడు రాజా, క్రిష్ణుడు వంటి వారు వైసీపీకి చాలా సందర్భాలలో మద్దతుగా నిలిచారు. అదే విధంగా నటుడు గిరిబాబు, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా వైసీపీ మద్దతుదారుల జాబితాలో ఉన్నారు
ఇక కలెక్షన్ కింగ్ గా పేరు గడించిన మోహన్ బాబు, ప్రముఖ సినీ నటి జయసుధ సైతం వైసీపీకి సపోర్టుగా నిలిచారు. వీరితో పాటుగా రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి, మంచి కమెండియన్ గా పేరు తెచ్చుకున్న అలీ, మరో కమెడియన్ పృధ్వీ వంటి వారు కూడా వైసీపీకి 2019 ఎన్నికల వేళ పూర్తి మద్దతుగా ఉన్నారు.
వీరిలో పదవులు అందుకున్న వారిలో పృథ్వీ ఉన్నారు. ఆయనకు టీటీడీ చానల్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ వివాదాల నడుమ ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. దాంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇక అలీకి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని అనుకున్నా అది జరగలేదు. దాంతో ఆయనకు మీడియా సలహాదారు పదవిని ఇచ్చారు.
ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీకి గుడ్ బై అంటూ దూరమైపోయారు. ఇపుడు అయిదు నెలల తరువాత పోసాని క్రిష్ణ మురళీ కూడా వైసీపీకి దూరం అన్నారు. అంతే కాదు తన నోటి వెంట రాజకీయాల ప్రసక్తే రాదు అని కూడా చెప్పేశారు. పోసాని వైసీపీ ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు.
ఇవన్నీ చూసిన తరువాత ఆలోచిస్తే వైసీపీకి సినీ పరిశ్రమ నుంచి మిగిలిన వారు ఎవరు అన్న చర్చ మొదలైంది. మోహన్ బాబు తో పాటు ఇతర సినీనటులు చాలా కాలం క్రితం నుంచి ఆ పార్టీకి దూరం జరిగారు. ఇపుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న పోసాని కూడా తప్పుకోవడంతో టాలీవుడ్ నుంచి వైసీపీ గొంతుకగా గట్టిగా మాట్లాడేవారు అయితే ఎవరూ లేరు అనే అంటున్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీలో ఉన్నా ఆమె సినీ నటి కంటే రాజకీయ నేతగానే అంతా గుర్తిస్తున్నారు. సో వైసీపీకి పూర్తిగా సినీ గ్లామర్ అన్నది లేకుండా పోయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీకి సినీ గ్లామర్ పదింతలు పెరిగింది. ఆ పార్టీకి మద్దతుగా సినీ నటులు ఇతర టెక్నీషియన్స్ అంతా ఉన్నారు
జనసేనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారధిగా ఉన్నారు. ఆయనకు మెగా కుటుంబమే అండగా ఉంది. సో ఇలా కనుక ఆలోచిస్తే టాలీవుడ్ మద్దతు పెద్దగా లేని పార్టీగా వైసీపీ నిలిచింది అని విశ్లేషిస్తున్నారు. అయితే రాజకీయాలు నిరంతం సాగే నది లాంటివి. ఇపుడున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. అందువల్ల వైసీపీ కనుక మళ్లీ పుంజుకుంటే రేపటి రోజున ఎవరైనా మళ్లీ ఈ వైపు చూసే అవకాశం ఉంది అంటున్నారు. అంతవరకూ మాత్రం వైసీపీని సినీ కళ లేక ఇబ్బందిపడాల్సిందే అని అంటున్నారు.