ఖమ్మంలో దారుణం.. స్కూలు పిల్లలున్న ఆటోను లాక్కెళ్లిన ఫైనాన్స్ సిబ్బంది

వాహన ఫైనాన్స్ సిబ్బంది ఖమ్మంలో అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన తాజాగా జరిగింది. కిస్తీ చెల్లించలేదని.. ఓ ఆటోను పట్టుకెళ్లారు ఫైనాన్స్ సంస్థ సిబ్బంది.

Update: 2023-11-26 15:30 GMT

"రుణ వేధింపులు".. ప్రస్తుతం సమాజంలో ప్రధాన సమస్య ఇది. యాప్ ల ద్వారా రుణాలు తీసుకుని, పూర్తిగా చెల్లించినా వేధింపులు ఎదుర్కొంటున్నారు కొందరు.. అసలు తమకేం సంబంధం లేకున్నా రుణం తీసుకున్నవారు తమ ఫోన్ నంబరు ఇవ్వడంతో మరికొందరు వేధింపుల బారినపడుతున్నారు.. ఇంకొందరు అవసరాలకు అప్పులు తీసుకుని చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వార్తలు రోజుకు బోలెడు.. స్తోమత లేకున్నా ఆడంబరాలకు ఖర్చు చేయడం, అనుకోని పరిస్థితుల్లో అప్పులు చేయడం.. అసలు తీర్చే చాన్సే లేకున్నా డబ్బులు తీసుకోవడం, అప్పు తీసుకున్నాక ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం.. ఇలాంటి అనేక పరిస్థితుల నడుమ విష వలయంలో చిక్కుకుంటున్నారు ప్రజలు. వీటినుంచి బయటపడే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఆ వేధింపులు అసాధారణం

రుణ చెల్లింపులో విఫలమైనా.. కొన్నిసార్లు చెల్లించినా వేధింపులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేధింపులు కూడా అసాధారణ స్థాయిలో ఉంటున్నాయి. ఫొటోలను అసభ్యంగా మార్చి బంధువులు, సన్నిహితులకు పంపడం, ఫోన్ చేసి దూషణలకు దిగడం ఇలా ఉంటాయి వేధింపులు. ఇక వాహనానికి ఫైనాన్స్ తీసుకుని దానిని పలు హెచ్చరికల అనంతరం కూడా చెల్లించకపోతే లాక్కెళ్లిన ఉదాహరణలను చూశాం. ఇంటిపై ఫైనాన్స్ తీసుకుని కిస్తీలు కట్టేలేకపోతే ఫైనాన్స్ సిబ్బంది వచ్చి.. సామగ్రి ఎత్తుకెళ్లడం, ఇంట్లోని వ్యక్తులను అందులోనూ మహిళలను బెదరించడం కూడా వార్తలుగా వచ్చాయి. వెరసి.. అప్పు చెల్లించాల్సిన బాధ్యత తీసుకున్న వ్యక్తులదైతే, చెల్లింపులో విఫలమైన వారిపట్ల అమర్యాదగా వ్యవహరించకపోవడం అప్పు ఇచ్చిన సంస్థల బాధ్యతగా ఉండాలి.

ఖమ్మంలో ఇది మరీ దారుణం..

వాహన ఫైనాన్స్ సిబ్బంది ఖమ్మంలో అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన తాజాగా జరిగింది. కిస్తీ చెల్లించలేదని.. ఓ ఆటోను పట్టుకెళ్లారు ఫైనాన్స్ సంస్థ సిబ్బంది. గమనార్హం ఏమంటే.. అది స్కూలు పిల్లలను తరలిస్తున్న ఆటో. విద్యార్థులు ఆటోలో ఉన్నప్పటికీ.. దానిని జప్తు చేసి తీసుకెళ్లడం అత్యంత బాధాకర అంశం. అది కూడా ఏ కొద్ది సమయమో కాదు. దాదాపు మూడు గంటలపాటు విద్యార్థులను ఆటోతోపాటు అదుపులో ఉంచుకున్నారు. రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి, బద్యాతండా, హర్యతండా ప్రాంతాలకు చెందిన పది మంది గిరిజన విద్యార్థులు.. ఖమ్మంలోని స్కూళ్లలో చదువుతున్నారు. రోజూ వీరిని తీసుకెళ్లే ఆటో యజమాన్ని వాహనాన్ని ఫైనాన్స్ లో తీసుకెళ్లాడు. శనివారం విద్యార్థులను స్కూళ్ల నుంచి తీసుకెళ్తుండగా, ఫైనాన్స్ సంస్థ సిబ్బంది అడ్డం పడ్డారు. కిస్తీ కట్టాలని హెచ్చరించి వదిలేయకుండా.. ఆటోను, విద్యార్థులను రోటరీ నగర్ లోని సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లారు. చిన్నపిల్లలను కూడా కార్యాలయంలోనే కూర్చోబెట్టారు. ఆటో డ్రైవర్ బతిమిలాడినా వినలేదు.

పిల్లలు రాకపోవడంతో అల్లాడిన తల్లిదండ్రులు

రోజూ సాయంత్రానికి ఇంటికి వచ్చే పిల్లలు.. శనివారం ఎంతకూ రాకపోయేసరికి గిరిజన తల్లిదండ్రులు అల్లాడారు. తమవారికేమైందోనంటూ కంగారు పడ్డారు. చివరకు ఆటో ఫైనాన్స్ సంస్థ మేనేజర్ స్పందించి.. ఆటోను, విద్యార్థులను ఇంటికి పంపారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక విషయాలు ఫైనాన్స్ సంస్థ, డ్రైవర్ చూసుకోవాలి కానీ.. పిల్లలను ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ మండిపడ్డారు. కాగా, ఈ దారుణం పోలీసుల వరకె వెళ్లిందీ లేనిది ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News