ప్రకాశం బ్యారేజీ చరిత్రలో తొలిసారి !

తాజా వరదల్లో రికార్డ్ స్థాయిలో 11.20 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరుకున్నది.

Update: 2024-09-02 09:09 GMT

కృష్ణమ్మ ఉగ్రరూపం పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది. 15 ఏళ్ల తర్వాత కృష్ణా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. ఆల్మట్టి నుండి మొదలుపెడితే నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టెయిల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేశారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో తొలిసారి రికార్డ్ స్థాయిలో వరద ప్రవాహం వస్తున్నది.

2009 వరదల్లో 10.94 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. తాజా వరదల్లో రికార్డ్ స్థాయిలో 11.20 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరుకున్నది. అంటే రోజుకు 110 టీఎంసీల ప్రవాహం అక్కడకు వస్తుంది. ఇది కేవలం రెండు రోజులలో శ్రీశైలం ప్రాజెక్టును నింపే స్థాయి కావడం విశేషం. భారీ ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ - హైదరాబాద్ రహదారి మీద నీళ్లు చేరడంతో హైదరాబాద్ - విజయవాడల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ప్రకాశం బ్యారేజీకి వరద కారణంగా విజయవాడ రామలింగేశ్వర నగర్ నీట మునిగింది. దీంతో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిటైనింగ్ వాల్ కారణంగా ప్రస్తుతానికి అందరూ క్షేమంగానే ఉన్నారు.

Tags:    

Similar News