'ఫ్లెమింగ్ ఫెస్టివల్ - 2025'... అట్టగాసంగా ప్రారంభమైన వేడుకలు!

ఆంధ్రప్రదేశ్ కి పర్యాటక శోభ వచ్చేసింది.. సుమారు ఐదేళ్ల తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ - 2025 కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది.

Update: 2025-01-19 13:29 GMT

ఆంధ్రప్రదేశ్ కి పర్యాటక శోభ వచ్చేసింది.. సుమారు ఐదేళ్ల తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ - 2025 కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా.. ఈ నెల 18 నుంచి 20 వరకూ జరగనున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ - 2025 వేడుకలు శనివారం ఉదయం సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.


ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే విజయ శ్రీ, కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర సంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు బెలూన్ ఎగురవేసి తరువాత.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ స్పందిస్తూ... ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఐదేళ్ళ తరువాత జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని.. దీనికి సీఎం ప్రోత్సాహం ఎంతో ఉందని.. టూరిజం శాఖ మంత్రి సహకారం అందించారని.. జిల్లా కలెక్టర్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించడానికి చాలా శ్రమించారని అన్నారు.


ఇదే సమయంలో... వారందరితో పాటు జిల్లా యంత్రాంగం అంతా ఎంతో కృషి చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఇందులో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని కోరారు. పులికాట్ సరస్సు, అటకాని తిప్ప, బివి పాలెం బోటింగ్ తదితర టూరిస్ట్ ప్రదేశాలను అంతా వచ్చి తిలకించాలని కోరారు!

ఇదే సమయంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్.. మాట్లాడుతూ సుమారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని.. తిరుపతి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామని.. సీఎం, ఎమ్మెల్యేతో కలిసి జిల్లా యంత్రాంగం ఈ ఫెస్టివల్ ను మీ ముందుకు తెచ్చిందని అన్నారు.

ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ నోడల్ శాఖగా, అటవీ శాఖ సపోర్టింగ్ శాఖగా రెండు శాఖల ఆధ్వర్యంలో నేడు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నామనీ అన్నారు. వన్య సంపదను, పులికాట్ సరస్సును, నేలపట్టు పక్షుల అభయారణ్యాన్నీ ప్రమోట్ చేస్తూ.. పులికాట్ సరస్సు మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులకు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

టూరిజం వల్ల మనకు ఎంతో ఆదాయం వస్తుందనీ.. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా టూరిజం మీద వచ్చే సంపద చాలా ఎక్కువ ఉంటుందనీ.. ఒకవైపు టూరిజం చేస్తూనే ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా... ఇక్కడి మత్స్యకారులకు ఉన్న సమస్యలపై మనం దృష్టి పెట్టుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఎప్పుడు ఆలోచిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయనీ, వాటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నిటికి కూడా క్యాచ్ మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉందనీ.. ఇందులో భాగంగా... తమిళనాడు రాష్ట్రం నుండే కాకుండా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, మొదలైన జిల్లాల నుంచి చాలామంది పర్యాటకులు వస్తారని అన్నారు. పర్యాటకులకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఈ నెల 18, 19 మరియు 20 తేదీల్లో మొత్తం మూడు రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లలకి స్పోర్ట్స్, వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పర్యాటక ప్రేమికులకి అదే విధంగా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ బోటింగ్.. అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్, అనేక రకాల మంచి స్టాల్ లు ఏర్పాటు చేశామనీ అన్నారు.

అనంతరం.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ... ఒక సంకల్పంతో, ఒక ప్రాంతం తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ కి.. కలెక్టర్, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం పర్యాటకుల్ని, ప్రకృతి ప్రేమికులను, పక్షుల ప్రేమికులను అందర్నీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లా యంత్రాగం, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయి, ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మొత్తం రాష్ట్రానికి సంబంధించి అనేక ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటిగా ఈ ఫ్లెమింగో ఉత్సవాలను నిర్వహించడం రాష్ట్రంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు.

అక్కడ ఫ్లెమింగ్ పక్షులు, నేలపట్టు ప్రాంతం, పులికాట్ సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సులు చూడటం కళ్ళకు విందుగా ఉంటుందని తెలిపారు. ఈ పక్షులు నాలుగైదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయని, వాటికీ కులమత బేధాలు లేకుండా అందరూ కలిసి ఒకటే భావంతోటి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటికీ సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయని అన్నారు.

అటువంటి కనువిందు కార్యక్రమాన్ని పులికాట్ సరస్సు, అటకాని తిప్ప, నేలపట్టు ఎంతో అద్భుతంగా పక్షులకి ఆలవాలం అని అన్నారు. బి వి పాలెం వద్ద బోటింగ్ ఏర్పాటుతో పర్యాటకుల్ని కనువిందు చేయనున్నాయి తెలిపారు. వాటికి సంబంధించి వాటన్నిటిని కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కలెక్టర్ రూపొందించారని అన్నారు.

చాలా తక్కువ సమయంలో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక పక్కన రాజకీయ నాయకులు, జిల్లా యంత్రాగానికి.. పర్యాటక శాఖ మంత్రిగా తాను ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాంతములో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. టూరిజం ఇండస్ట్రీగా గుర్తించి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అన్నారు. పీపీపీ మోడల్ తో పాటు ఇప్పుడు మన ముఖ్యమంత్రి పీ4 మోడల్ మీద అందరూ పని చేయాలని పబ్లిక్, ప్రైవేట్ ప్యూపిల్స్ పార్టనర్ షిప్ ను తీసుకొచ్చారని అన్నారు. అందులో భాగంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.

2020లో చివరిసారిగా ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగిందని.. ఈ 5 సంవత్సరాల కాలంలో పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా పడిపోయిందని, ఒక్కరోజు కూడా పర్యాటక శాఖ మంత్రులు పని చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, కలెక్టర్ కి, ఇతర విభాగాలు వారందరికీ అభినందనలు తెలియశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ శ్రీమంత్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఆర్డీవో కిరణ్మయి, ఆర్టీ టూరిజం రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారి సూళ్లూరుపేట హారిక, సంబంధిత అధికారులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News