వైరల్‌ వీడియో.. కూలిన విమానం.. 18 మంది మృత్యువాత!

భారత్‌ పొరుగు దేశం.. నేపాల్‌ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-07-24 07:59 GMT

భారత్‌ పొరుగు దేశం.. నేపాల్‌ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌ రాజధాని ఖాట్మండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతున్న ఒక విమానం కుప్పకూలింది. దీంతో ఆ విమానంలో ఉన్న 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పైలట్‌ కెప్టెన్‌ మనీష్‌ శాఖ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

నేపాల్‌ రాజధాని ఖాట్మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శౌర్య ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం బయల్దేరింది. విమానం ఖాట్మండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఆ విమానంలో పైలట్‌ తో కలిపి 19 మంది ఉన్నారు. టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి క్రాష్‌ అయ్యింది. దీంతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. అయితే విమానం నేలకు ఢీకొట్టి మంటలు చెలరేగడంతో విమానం మొత్తం దగ్ధమైపోయింది. దీంతో మంటల్లో 18 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

ఈ ఘోర దుర్ఘటనలో తీవ్ర గాయాలతో బయటపడ్డ పైలెట్‌ ను ఆస్పత్రికి తరలించారు. అతడిని ఖాట్మండూ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

విమానం కూలిపోయిన క్షణంలో రికార్డ్‌ చేయబడిన రెండు వీడియో ఫుటేజీలు కూడా బయటపడ్డాయి. ఈ ఫుటేజీల్లో విమానం కూలిపోవడం, వెంటనే పెద్ద ఎత్తున ఆకాశంలోకి పొగలు వ్యాపించడం, మంటల్లో విమానం కాలిపోవడం కనిపిస్తోంది.

కాగా ఈ విమాన ప్రమాద ఘటనపై త్రిభువన్‌ విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై నేపాల్‌ ప్రధాని సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News