పెట్రోలు కొరత.. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఐడియా అదుర్స్!
తమకు ఇబ్బందిని కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్ డ్రైవర్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.
తమకు ఇబ్బందిని కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్ డ్రైవర్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. హిట్ అండ్ రన్ (ఢీకొట్టి పారిపోవడం) కేసులకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న రెండేళ్ల జైలుశిక్షను కేంద్ర ప్రభుత్వం ఏకంగా పదేళ్లకు పెంచుతూ చట్టాన్ని చేసింది. అంతేకాకుండా జరిమానాను సైతం భారీగా పెంచింది. దీంతో ట్రక్, ట్యాంకర్ డ్రైవర్లు ఈ చట్టాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. కావాలని ఎవరూ ప్రమాదాలు చేయరని.. అనుకోకుండానే ప్రమాదాలు జరుగుతాయని వారంటున్నారు. దేశవ్యాప్తంగా ట్రక్ లు, ట్యాంకర్లు నిలిచిపోవడంతో పెట్రోలు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పెట్రోలు ట్యాంకర్ల డ్రైవర్ల ధర్నాతో పెట్రోల్ కొరత ఉంటుందనే అంచనాలతో హైదరాబాద్ లో భారీ ఎత్తున వాహనదారులు పెట్రోలు బంకుల ముందు పోటెత్తారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు పెట్రోలు కొరత వాహనదారులతోపాటు ఫుడ్ డెలివరీ బాయ్స్ పైనా పడింది. స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ నిత్యం కొన్ని వందల కిలోమీటర్లు తిరుగుతుంటారు. పెట్రోలు కొరతతో ఫుడ్ డెలివరీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి.
దీంతో ఒక జొమాటో డెలివరీ బాయ్ పెట్రోలు కొరత వల్ల తమ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వినూత్న ఐడియాతో ముందుకొచ్చాడు. ఒక గుర్రంపైన స్వారీ చేస్తూ తన వెనుక ఫుడ్ డెలివరీ బ్యాగ్ ను తగిలించుకుని కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేశాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే చంచల్ గూడలో జరగడం విశేషం.
ఫుడ్ డెలివరీ బాయ్ దాదాపు మూడు గంటల పాటు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ లో వేచి ఉన్నాడు. అయినప్పటికీ అతడికి పెట్రోలు దొరకలేదు. దీంతో విసిగి వేసారిపోయిన అతడు ఓ గుర్రం తీసుకుని దానిపై ఫుడ్ ఆర్డర్ లను డెలివరీ చేశాడు. ఫుడ్ డెలివరీకి వెళ్తున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
సూపర్ ఐడియా, ఏం ఐడియా గురు అంటూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నవారికి మాత్రం ఫుడ్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దీంతో వారంతా యధావిధిగా ఫుడ్ డెలివరీలు చేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో ట్యాంకర్లు పెట్రోలు తీసుకుని అన్ని బంకులకు బయలుదేరుతున్నాయి. దీంతో పెట్రోలు కొరతకు చెక్ పడనుంది.