విదేశీ అతిథుల కోసం చెరువునే రాసిచ్చేశారు..
అటవీశాఖ ద్వారా విదేశీ విహంగాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో మాత్రం గ్రామస్థులే తొలుతఆ బాధ్యతలు తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం, పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, నెల్లూరు జిల్లా నేలపట్టు ఇవన్నీ విదేశీ పక్షుల విడిది కేంద్రాలు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతాలకు విదేశీ విహంగాలు వచ్చిపోతుంటాయి. శీతాకాలం వచ్చిందంటే చాలా ఈ ప్రాంతాలు అరుదైన పక్షి జాతులతో నిండిపోతాయి. పర్యాటకులకు కనువిందు చేసే ఈ విదేశీ అతిథులు ఏపీలోని మరో ప్రాంతాన్ని తమ విడిది కేంద్రంగా ఎంపిక చేసుకున్నాయి. ఈ కొత్త కేంద్రమే గుంటూరు జిల్లా ఉప్పలపాడు. గత మూడు దశాబ్దాలుగా ఈ ఊరికి విదేశీ విహంగాలు వస్తున్నాయి. మిగిలిన చోట్లకు భిన్నంగా ఏడాది పొడుగునా, ఈ విడిది కేంద్రంలో పక్షులు సందడి చేస్తున్నాయి.
అటవీశాఖ ద్వారా విదేశీ విహంగాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో మాత్రం గ్రామస్థులే తొలుతఆ బాధ్యతలు తీసుకున్నారు. అరుదైన పక్షులు తమ గ్రామానికి వస్తుండటాన్ని గమనించిన ఉప్పలపాడు గ్రామస్థులు తమ మంచినీటి అవసరాల కోసం తవ్విన 27 ఎకరాల చెరువులో తొమ్మిది ఎకరాలను విదేశీ పక్షుల విడిది కోసం వదిలేశారు. అటవీశాఖకు ఆ 9 ఎకరాలను అప్పగించారు. అంతేకాకుండా పక్షులు విడిది చేసేందుకు అనువైన స్టాండ్ లను గ్రామస్థులే ఏర్పాటు చేయడం ఇక్కడి విశేషం. అంతేకాకుండా పక్షుల సంరక్షణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ గ్రామస్థులు ప్రశంసలు అందుకుంటున్నారు.
మధ్య ఆసియా, తూర్పు యూరప్, నైజీరియా, సైబీరియా నుంచి ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు వస్తుంటాయి. సహజంగా ఇవి తమ విడిదికి సముద్ర తీరప్రాంతాన్ని ఎంచుకుంటాయి. పెద్ద చెరువులు, ఎక్కువ చెట్లు ఉన్న ప్రాంతాల్లో బస చేస్తాయి. ఈ సమయంలో విదేశాల్లో మంచుగడ్డ కట్టేస్తుంది. దీనివల్ల పక్షులకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అదే సమయంలో పక్షుల సంతోనోత్పత్తికి అవరోధం కలుగుతుంది. దీంతో విదేశీ విహంగాలు మన దేశం వచ్చేస్తుంటాయి. ఇక్కడ గుడ్లు పొదిగి పిల్లలు పెద్దయ్యే వరకు ఉంటాయి. వాటికి ఎగరడం నేర్పడంతోపాటే వేట అలవాటు చేస్తాయి.
ఇలా విదేశాల నుంచి వచ్చే పక్షులు తొలుత శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. దాదాపు 30 ఏళ్లుగా గుంటూరు జిల్లాకు ఈ విదేశీ అతిథులు రావడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. గుంటూరు నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పలపాడు పెదకాకాని మండలంలో ఉంది. ప్రపంచంలోని అరుదైన పక్షులు తమ గ్రామానికి రావడం గమనించిన గ్రామస్థులు.. అవి ఆవాసంగా ఎంపిక చేసిన మంచినీటి చెరువును పక్షుల విడిదికి అనుకూలంగా మార్చేశారు. పక్షులు గుడ్లు పెట్టేందుకు, సంతాన ఉత్పత్తికి వీలుగా స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ చెరువును అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. పక్షుల సంరక్షణ కోసం గ్రామంలోని యువకులు గ్రామ పర్యావరణ కమిటీ పేరుతో సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు.
సాధారణంగా ఈ శీతాకాలంలో మాత్రమే విదేశీ పక్షులు వస్తుంటాయి. కానీ ఉప్పలపాడులో ఏడాది పొడుగునా, ఏదో ఒక పక్షి జాతి వలస వచ్చి, విడిది చేయడం ఇక్కడ ప్రత్యేకత. సెప్టెంబరులో పెలికాన్స్, జనవరిలో పెయింటెడ్ స్టార్క్స్, మార్చిలో నైట్ హెరాన్స్, జూన్, జులైల్లో ఓపెన్ బిల్స్, వైట్ ఐబిస్, రోజ్ ఐబిస్ తదితర పక్షి జాతులు ఉప్పలపాడు వస్తుంటాయి. రాష్ట్రంలోని మిగిలిన పక్షి విడిది కేంద్రాల్లో వందల ఎకరాల్లో నీటి వనరులు ఉండగా, ఉప్పలపాడులో కేవలం 27 ఎకరాల చెరువుతోనే సరిపెట్టుకుంటున్నాయి. అయితే వీటికి ఆహార కొరత రాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేప పిల్లలను చెరువులో వేస్తుంటుంది. దీంతో ఉప్పలపాడు వచ్చే పక్షి జాతులు ఏటా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 27 నుంచి 30 రకాల పక్షులు ఇక్కడ విడిది చేస్తున్నాయి. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.