పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులు ఫైనల్ గా తేల్చిందిదే!
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి ఈ అంశం కారణమవుతోంది. గతంలో మీ హయాంలో చేసిన తప్పులు వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని వైసీపీ అంటుంటే.. ఐదేళ్లు అధికారంలో ఉండి రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టును జగన్ గోదావరిలో ముంచారని చంద్రబాబు మండిపడుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. పోలవరంను పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన ప్రాజెక్టు పూర్తికి కనీసం నాలుగు సీజన్లు పడుతుందని.. నాలుగేళ్లు పడుతుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పోలవరం స్థితిగతులు తెలుసుకోవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది. ఈ బృందం గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టును అన్ని కోణాల్లో అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందజేసింది.
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో మళ్లీ కొత్తదాన్ని నిర్మించాలని నిర్ణయించారు. విషయాన్ని కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. దీంతో పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమా అనే చర్చ ఇక అవసరం లేదన్నారు.
ఈ నేపథ్యంలో కొత్త డయాఫ్రం వాల్ ఏ ప్రదేశంలో నిర్మించాలి? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ కు ఎంత దూరంలో ఉండాలి? ఎలా నిర్మించాలనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులకు సూచించారు.
కాగా నాలుగు రోజులుగా పోలవరంలో తాము పరిశీలించిన అంశాలను కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్, విదేశీ నిపుణులు... కేంద్ర జల సంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రాకు నివేదిక రూపంలో అందించారు.
ఈ నివేదికలో ప్రస్తుతం పోలవరం పరిస్థితి, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు ఎలా ఉన్నాయి? కాఫర్ డ్యాముల స్థితిగతులు, డయాఫ్రమ్ వాల్ తదితర అంశాలను పొందుపరిచారు.
ఈ నివేదిక ఆధారంగా∙ఓహ్రా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్ బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంచార్జి చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలసంఘం డిజైన్ల విభాగం చీఫ్ ఇంజినీర్ విజయ్ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విదేశీ నిపుణులు నాలుగు రోజుల తమ పర్యటనలో పోలవరం ప్రాజెక్టులో అధ్యయనం చేసిన అంశాలను ఆయనకు వివరించారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమన్నారు.
ప్రస్తుతానికి ఉన్న అన్ని నివేదికలను అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక అందిస్తామని కుష్విందర్ ఓహ్రాకు నిపుణులు చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఓహ్రా సూచించారు.
ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ డిజైన్లకు కేంద్ర జలసంఘానికి పంపి తుది ఆమోదం తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.