కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత.. ఆయన ప్రత్యేకత ఏమంటే?

కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితుడైన ఎస్ఎం క్రిష్ణ పలు కీలకపదవుల్ని నిర్వహించారు.

Update: 2024-12-10 05:07 GMT

అధికారం చేతిలోకి రాగానే సరిపోదు. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే ఆ లెక్కే వేరు ఉంటుంది. ఆ కోవలోకేవస్తారు కర్ణాటకరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. మాజీ కేంద్రమంత్రి.. అన్నింటికి మించి కర్ణాటక విషయంలో దార్శనికుడిగా వ్యవహరించి.. ఆ రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లటంలో కీలక భూమిక పోషించిన నేత ఎస్ఎం క్రిష్ణ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ఆయన ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ లో తుదిశ్వాస విడిచారు.

కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితుడైన ఎస్ఎం క్రిష్ణ పలు కీలకపదవుల్ని నిర్వహించారు. 2004-2009 మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే బెంగళూరును ఐటీ నగరిగా మార్చటంలో ఆయన కీలకభూమిక పోషించారు. నిజానికి బెంగళూరుకున్న గార్డెన్ నగరి అన్న పేరుకు.. ఐటీ నగరి శోభ సంతరించటంలో ఎస్ఎం క్రిష్ణ కీలక భూమిక పోషించారు. ఒక దశలో ఐటీ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మాంచి జోరు మీద ఉన్న వేళ.. ఆ బరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది.

అయితే.. తనకున్న పలుకుబడి..అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం లాంటి సానుకూలతల నేపథ్యంలో ముందుచూపున్న ఎస్ఎం క్రిష్ణ బెంగళూరును ఐటీ నగరిగా మార్చేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. కేంద్రమంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. ఇతర కీలక పదవుల్ని చేపట్టిన ఆయన తనకున్న పలుకుబడితో తన సొంత రాష్ట్రానికి చాలానే చేసుకున్నారని చెప్పాలి.

2004 డిసెంబరు నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2009-2012 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. తాను ఏ స్థానంలో ఉన్నప్పటికి తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ఉండేది. ఈ విషయంలో ఎస్ఎం క్రిష్ణ మిగిలిన నేతలకు కాస్తంత భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. 2017లో బీజేపీలో చేరారు. అయితే.. గత ఏడాది మాత్రం తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఏమైనా.. కర్ణాటక డెవలప్ మెంట్ లోనూ.. ముఖ్యంగా బెంగళూరు నగరం ప్రపంచ ఐటీరంగంలో కీలక స్థానంలో నిలిచేలా చేయటంలో ఆయన పాత్రను చరిత్ర ఎప్పటికి మర్చిపోలేదని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News