సింప్లిసిటీకి కేరాఫ్ ఆ మాజీ ఎమ్మెల్యే.. ఎక్కడికెళ్లాలన్నా సైకిల్, బస్సులే..

అయినా ఇప్పటికీ ఆయన సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇంతవరకు ఆయన దగ్గర చిల్లిగవ్వ లేదు.

Update: 2024-11-14 11:30 GMT

రాజకీయాల్లో ఒక్కసారి ఎమ్మెల్యే హోదా దక్కితేనే ఫార్చునర్ కార్లు.. పెద్ద భవంతులు.. వందలాది ఎకరాల భూములు.. పెద్దపెద్ద కాంట్రాక్టులు చేయడం చూస్తుంటాం. అంతేకాదు.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే గర్వం కూడా పెరిగిన వారినీ చూశాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఇది అవాస్తవమని చెప్పే వారు కూడా లేరు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడా ఆస్తులు కూడ బెట్టుకుంటున్న రోజులివి.

కానీ.. ఆయన మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా ఇప్పటికీ ఆయన సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇంతవరకు ఆయన దగ్గర చిల్లిగవ్వ లేదు. నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికీ ఆయన ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్, బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అప్పుడెప్పుడో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన రావి నారాయణరెడ్డి అసెంబ్లీకి రిక్షాలోనే వెళ్లేవారిని విన్నాం. గుమ్మడి నర్సయ్య కూడా అంతే. ఏ మూలకు వెళ్లాలన్నా ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి అసెంబ్లీకి ఎర్రబస్సులోనే వెళ్తారు. ఇతర పనులపై హైదరాబాద్ వెళ్లాల్సి వస్తే అదే బస్సు జర్నీని ఆశ్రయిస్తారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెట్టే రూ.5 భోజనం తింటూ కనిపిస్తారు.

ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం.. ఐదు పర్యాయాలు ఎన్నికైనప్పటికీ బస్సులు, రైళ్లలో జర్నీలు చేశారు. హైదరాబాద్ వచ్చినా ఆటోలనే ఆశ్రయించారు. పార్టీ ఆఫీసులోనే బస చేశారు. అయితే.. ఇప్పటికీ ఆయన పేరు మీద ఓ పొలం తప్ప మరేమీ లేదంటే నమ్మాల్సిందే. ఇంత సింప్లిసిటీగా బతికే లీడర్‌ను మనం భవిష్యత్తులోనూ చూడలేకపోవచ్చు. అందుకే.. ఆయన జీవితాన్ని వెండితెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి పరీక్షల నిమిత్తం గుమ్మడి నర్సయ్య వెళ్లారు. అక్కడ కూడా తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానన్న గర్వం ఏ మాత్రం చూపకుండా అందరితోపాటు క్యూలో నిల్చుండిపోయారు. అందరితోపాటు వేచి చూసి తన వంతు వచ్చాకనే పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనపై మరోమారు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటి నేతలు గుమ్మడి నర్సయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News