మాజీ సీఎం పోటీ అక్కడి నుంచే!
ఈసారి రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారయినట్టే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటన విడుదలవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాతే ఎవరెన్ని సీట్లలో పోటీ చేసేది ప్రకటిస్తారని అంటున్నారు.
కాగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీ అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలనే అధికంగా అడుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో కీలకమైన స్థానమైన రాజంపేట నుంచి బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉన్నప్పుడు రాజంపేట నుంచి బీజేపీ తరఫున దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు.
ఈసారి రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. గతంలో ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట నుంచి సాయిప్రతాప్ ఎంపీగా గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019ల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.
ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా, సన్నిహితుడిగా మిథున్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు జిల్లాలకు పార్టీ తరఫున రీజినల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అలాగే పార్టీ లోక్ సభా పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా మిథున్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మిథున్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. గతంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గా, స్పీకర్ గా కేబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య కొంత కాలం సీఎంగా చేశాక కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. దాదాపు రెండేళ్లకు పైగా ఈ పదవిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.
వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రిగా చక్రం తిప్పాలన్నదే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండుసార్లు సులువుగా గెలుపొందిన మిథున్ రెడ్డికి ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చని టాక్ నడుస్తోంది.