ఎన్ని సిత్రాలో.. సినిమా టాకీస్ కు రైతుబంధు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఒక సినిమా టాకీస్ కు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయాన్ని అందించిన వైనం వెలుగు చూసింది.

Update: 2025-01-21 03:51 GMT

వ్యవసాయం చేసే భూమికి రైతుబంధు అమలు చేయటం తప్పేం కాదు. కానీ.. ఈ పథకం పేరుతో వాణిజ్య స్థలాలకు రైతుబంధు వర్తించేలా చేయటం ఒక ఎత్తు. అందుకు భిన్నంగా వాణిజ్య సముదాయాల్ని సైతం వ్యవసాయ భూమిగా చూపిస్తూ రైతుబంధు పథకం పైసలు అకౌంట్లో వేసుకోవటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో నిజమైన లబ్థిదారులకు మాత్రమే రైతుబంధు పథకం అమలు కావాలన్న ఉద్దేశంతో సర్వే చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆ కోవకు చెందిందే తాజా పరిణామం.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఒక సినిమా టాకీస్ కు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయాన్ని అందించిన వైనం వెలుగు చూసింది. సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసా నిలిపివేయాలని.. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని రేవంత్ సర్కారు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా రెవెన్యూ.. వ్యవసాయ.. పంచాయితీరాజ్ తదితర శాఖల అధికారులు సర్వే చేపట్టగా.. అందులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

గుంట స్థలం కూడా వ్యవసాయం చేయటానికి వీల్లేని స్థలాల్ని.. పంక్షన్ హాల్స్ ను.. సినిమా టాకీసులు.. రైసుమిల్లులు.. వాణిజ్య సముదాయాలు.. రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు రైతుబంధు ద్వారా డబ్బులు తీసుకుంటున్న దుర్మార్గం వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ కూడా రైతుబంధు పథకం పైసలు తీసుకున్నారు.

అంతకు మించి అన్నట్లుగా ఇదే పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలోని శ్రీరామా సినీ టాకీస్.. ఎస్ వీఆర్ ఫంక్షన్ హాల్.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు నిధులు జమ అవుతున్న విషయాన్ని గుర్తించారు. ఒక్క సుల్తానాబాద్ పట్టణంలోనే దాదాపు 40 ఎకరాలకు అక్రమంగా రైతుబంధు నిధులు పొందుతున్న వారిని గుర్తించి.. అనర్హులుగా డిసైడ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేస్తే.. మరెన్ని సిత్రాలు వెలుగు చూస్తాయో?

Tags:    

Similar News