యాడ్స్ పై క్లిక్ చేస్తే ఎరకు చిక్కినట్లే.. సైంగారెడ్డిలో సంచలన సైబర్ నేరం!
ఇటీవల కాలంలో తరచూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో తరచూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కారణం ఏదైనా, మార్గం మరేదైనా.. ఆన్ లైన్ ప్రకటనలను, పరిచయాలను నమ్మడం, పెట్టుబడులు పెట్టడం, ఆనాకా మోసపోవడ, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇటీవల పలు సందర్భాల్లో రొటీన్ గా మారిన పరిస్థితి. అలాంటి ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లాలో తెరపైకి వచ్చింది.
అవును... ఏ చిన్న అవకాశం దొరికినా, అవతల వ్యక్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నట్లు తెలిసినా... సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్ద గాళాలను సిద్ధం చేసి వదులుతున్నారు. ఒక్కోసారి భారీ వలలే విసురుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారని తెలుస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్ బుక్ లో సుమారు నెలన్నర రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన కని దర్శనమిచ్చింది. దీంతో... ఆ ప్రకటనపై ఈ ఉద్యోగి క్లిక్ చేశాడు. దీంతో... అతడు ఓ వాట్సప్ గ్రూప్ లో సభ్యుడిగా మారిపోయాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది.
ఈ సమయంలో ఆ గ్రూప్ లో వస్తోన్న ప్రకటనలకు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఆ గ్రూప్ లో పొందుపరిచిన పోర్టల్ లో వివరాలు చెక్ చేసుకుంటే.. భారీ లాభాలు వచ్చినట్లు అందులో చూపించారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి 22 దఫాలుగా సుమారు రూ.2.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. భారీ లాభాల ఆశలో ఉన్నాడు!
ఈ సమయంలో.. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ ఆ గ్రూప్ లో కోరాడు. అయితే... ఇతడు రిటన్స్ అడిగినప్పటి నుంచీ అవతల నుంచి స్పందన కరువైంది. దీంతో.. ఇది సైబర్ మోసమని, పూర్తిగా మోసపోయానని గ్రహించిన అతడు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లోనూ, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ రూ.2.4 కోట్ల సంగతి అలా ఉంచితే... యూట్యూబ్ లో కనిపించిన ఓ స్టాక్ మార్కెట్ ప్రకటన పై క్లిక్ చేశాడు మరో వ్యక్తి! అతను కూడా సరిగ్గా పైన చెప్పుకున్న వ్యక్తి తరహాలోనే వాట్సప్ గ్రూప్ లో చేరాడు. ఈ క్రమంలో సుమారు నెల రోజుల వ్యవధిలో రూ.66.75 లక్షల పెట్టుబడి పెట్టాడు. లాభాలు, పెట్టుబడి అడిగితే నో రెస్పాన్స్!
దీంతో... ఇతడు కూడా మోసపోయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు కేసులపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు!