'గ్యాస్' తన్నేస్తోంది.. బాబుకు మరకలు..!
ఇక, ఇప్పుడు ఉచిత గ్యాస్ కూడా అదే తరహాలో ఉంది.;

ప్రభుత్వం అమలు చేసే పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరినప్పుడు మాత్రమే ఆ పథకాలకు సార్థకత, ప్రభుత్వానికి పేరు! ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్.. అన్నట్టుగా పరిస్థితి మారుతుంది. గతంలో వైసీపీ పాలన సమయంలో పథకాలను వెతికి వెతికి మరీ అర్హులకు ఇచ్చా రు. అంతేకాదు.. ఎవరైనా అర్హత ఉండి మిస్సయితే.. ఏడాది చివరిలో అలాంటివారికి ఒకే సారి అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధినీ అందించారు.
ఇది వైసీపీకి సర్కారుపై విమర్శలకు తావు లేకుండా చేసింది. కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయంలో దీనికి భిన్నమైన వాదన బలపడుతోంది. విజయవాడ, ఏలూరులో వరదలు సంభవించినప్పుడు గత ఏడాది బాధితులకు అందరికీ సరైన పరిహారం అందలేదు. ఇప్పటికే వందల కొద్దీ బాధితుల దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో మూలుగుతున్నాయి. ఒకవైపు భారీ ఎత్తున పారిశ్రామిక వేత్తలు నిధులు, విరాళాలు ఇచ్చినా.. బాధితులకు ఎందుకు ఇవ్వలేదో సర్కారుకే తెలియాలి.
కనీసం 30 శాతం మంది బాధితులకు కూడా వరదల నష్టం అందలేదంటే.. అతిశయోక్తికాదు. ఇది టీడీపీ నేతలే చెబుతున్న మాట. ఫలితంగా వరదల్లో ప్రజలను ఆదుకున్నామని చెప్పుకొని.. ప్రచారం చేసుకునే విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆ ఊసు ఎత్తలేదు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఎంతో చేశామని చెబుతారు. కానీ, విజయవాడ, ఏలూరు వరదల విషయం మాట్లాడక పోవడానికి బాధితులకు సరైన న్యాయం జరగలేదన్న విమర్శలు ఉండడం వల్లే.
ఇక, ఇప్పుడు ఉచిత గ్యాస్ కూడా అదే తరహాలో ఉంది. దీనిపై ప్రత్యర్థి పార్టీల నాయకులు, విపక్ష వైసీపీ వంటివి యాగీ చేస్తే.. రాజకీయ దురుద్దేశంతో చేశారని పెదవి విరవొచ్చు. కానీ, టీడీపీని భుజాన మోసే అనుకూల మీడియాలోనే గ్యాస్ బాధితులను విరివిగా చూపిస్తున్నారు. అర్హులని గుర్తించిన తర్వాత.. కూడా వారికి గ్యాస్ రాయితీ ఇవ్వలేదు. నెలల తరబడి కంపెనీలు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మహిళలు వాపోతున్నారు.
మరోవైపు.. ప్రస్తుత తొలి దశకు గడువు దాటిపోతున్న సమయంలో ఇప్పటికే తీసుకున్నవారికి రాయితీ సొమ్ము(800 పైచిలుకు) పడకపోవడాన్ని ఎలా చూడాలో చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేకపోతే.. సూపర్ సిక్స్ కాస్తా.. సూపర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది!!